పుట్టపర్తి అర్బన్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందారు. పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పుట్టపర్తి రూరల్ పీఎస్ ఏఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామానికి చెందిన రైతు జలీల్ పొలంలో వేరుశనగ పంట తొలగించేందుకు రోజూ లాగే బుధవారం ఉదయం 9 గంటలకు ఏడుగురు కూలీలతో ఆటో బయలుదేరింది. తమ సొంత ఆటోలోనే కూలీలను తీసుకుని జలీల్ కుమారుడు ఫారూక్ బయలుదేరాడు. గ్రామ శివారుకు చేరుకోగానే 342వ జాతీయ రహదారి మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక దూసుకెళ్లడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ పక్కనే కూర్చున్న మహిళా కూలీ రాధ (32) ఆటో కింద పడడంతో కాలు, చెయ్యి విరిగాయి. ఫారూక్ తల్లి షేక్ మౌసిన్‌భాను తలకు తీవ్ర గాయమైంది. చెయ్యి విరిగింది. మరో కూలీ లక్ష్మీదేవి చెవి తెగిపడింది. సుకన్య, సరస్వతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను పెడపల్లిలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించి, ప్రైవేట్ కారులో అనంతపురానికి తరలిస్తుండగా రాధా పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మౌసిన్‌భానును అనంతపురానికి తరలించారు. లక్ష్మీదేవికి గోరంట్లలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పుట్టపర్తి రూరల్ పీఎస్ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు రాధ భర్త తలారి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ కల్లూరు ప్రసాద్ తెలిపారు. కాగా, రాధాకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
న్యాయం చేయాలని బాధితుల ధర్నా..
రాధ మృతిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ప్రమాదానికి కారణమైన ఫారూక్ ఇంటి ఎదుట ఉంచి దాదాపు 3 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఆటో నడపడం తెలియని ఫారూక్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఆటోకు ఇన్సూరెన్స్ లేదని, ఫారూక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా బాధితులు వినలేదు. ప్రమాదం జరిగిన వెంటనే టీడీపీ నేత ఆశ్రయించి అజ్ఞాతంలోకి వెళ్లిన ఫారూక్, ఆయన కుటుంబసభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా పోలీసులు చేయకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
న్యాయం చేయాలంటూ
బాధిత కుటుంబసభ్యుల ధర్నా
ఆటో బోల్తా – మహిళా కూలీ మృతి