శ్రీకాకుళం: తీర్థ యాత్రల కోసం బయల్దేరారు. దైవ దర్శనాలన్నీ సజావుగా జరిగాయి. తెలంగాణ నుంచి ఒడిశా వరకు ప్రయాణం అంతా సరదాగా గడిచిపోయింది. కానీ దేవుడు వారి నుదుటిపై తిరుగు ప్రయాణాన్ని రాయలేదు. ఒడిశా వెళ్లి దేవుడిని దర్శించుకున్న యాత్రికులు.. తిరిగి ఇంటికి చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. పలాస పరిధి రామకృష్ణాపురం వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో చైతన్యపురికి చెందిన రెండు కుటుంబాలు ఒడిశా టూర్‌కు బయల్దేరాయి. వీరు ఆదివారం బొలేరోపై బయల్దేరి పూరి, కోణార్క్ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంకు వద్ద డ్రైవర్ నిద్రపోయారు. కానీ వేగంగా ఇంటికి చేరుకోవాలనే తొందరలో యాత్రికులు డ్రైవర్‌ను నిద్రలేపి మరీ ప్రయాణం సాగించారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో పలాస మండలం రామకృష్ణాపురం వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌కు కళ్లు మూతలు పడడంతో బండి కల్వర్టును ఢీకొట్టింది.
బండిలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. వీరిలో గౌరిశెట్టి రజిత(వేదవతి)(55) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త కొండూరు వెంకటయ్య(65) పలాస ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే సముద్రాల కృష్ణయ్య(67), సముద్రాల పద్మ (50), కొండూరు విజయలక్ష్మి (55)లతో పాటు నల్గొండ జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన డ్రైవర్ పగిండ్ల జానయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రులకు సపర్యలు చేసి పోలీసులు, 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఆయా కుటుంబాలతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment