శ్రీకాకుళం: పలాస మండలం సరియాపల్లి పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పిలి కల్యాణి(20) అనే యువతి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 20వ వార్డు శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఇప్పిలి కల్యాణి అలియాస్ శిల్ప (20) శ్రావణ శుక్రవారం సందర్భంగా వేకువజామున తల్లితో పాటు వ్రతం ఆచరించింది.
వివిధ రకాల ప్రసాదాలను తయారుచేసి చుట్టు పక్కలవారికి పంచిపెట్టింది. కాశీబుగ్గ గాంధీనగర్‌లో డాక్టర్ పొందల జగదీష్ నడుపుతున్న శ్రీకృష్ణా ఆస్పత్రిలో ఆమె ఫిజియోథెరపిస్టుగా పని చేస్తోంది. పేషెంట్ నుంచి కాల్ రావడంతో ఆమె వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి వెళ్లేందుకు తన స్కూటీపై బయల్దేరింది. సరియాపల్లి పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి విశాఖ–ఇచ్ఛాపురం ఎక్స్‌ప్రెస్ బస్సు ఆమె స్కూటీని ఢీకొట్టింది. తలపై పెద్ద దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైపోయాడు.
మృతురాలిది పలాస పురుషోత్తపురం స్వగ్రా మం కాగా శివాజీనగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నా రు. ఆమె తండ్రి ఇప్పిలి బాలరాజు జీడి కార్మికుడిగా పనిచేస్తుండగా తల్లి ఇప్పిలి పుణ్యావతి జీడి కార్మికురాలుగా రోజువారీ కూలి పనిచేస్తుంటారు. సోదరుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.
వేకువనే లేచి అమ్మవారికి పూజ చేసి లక్ష్మీదేవిలా కనిపించిన కుమార్తె గంటల వ్యవధిలో ఇలా విగతజీవిగా కనిపించడంతో ఆమె తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఫోన్‌కాల్ రావడమే తన బిడ్డపాలిట మృత్యువుగా మారిందని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. నలభై రోజుల కిందటే ఆమె కొత్త స్కూటీ తీసుకోవడం గమనార్హం. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment