చెరువు గట్టు తవ్వకం అక్రమమే
● కదిలిన అధికార గణం ● మళ్లీ కొబ్బరి మొక్కలను నాటించిన వైనం
రణస్థలం: మండలంలోని కోష్ట పంచాయతీలో కృష్ణమ్మ చెరువు(కోనేరు)పై గట్టు తవ్వేసి కొబ్బరి మొక్కలు తొలగించడం అక్రమమేనని అధికారులు స్పష్టం చేశారు. ‘అంతా నా ఇష్టం’ పేరిట సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం గురువారం కదిలింది. కృష్ణమ్మ చెరువును పరిశీలించి మట్టి తొలగింపునకు గల కారణాలు అన్వేషించారు. మట్టి తరలింపునకు బాధ్యుడైన టీడీపీ నాయకుడు పిసిని జగన్నాథం సమక్షంలో అధికారులు చెరువును పరిశీలించారు. అతని పొలానికి మట్టి తరలించినట్లు గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. శ్మశాన వాటికకు రోడ్డు వేసేందుకు మట్టి తీసి తన పొలంలో వేసుకున్నానని జగన్నాథం చెప్పినట్లు అధికారులు వివరించారు. అయితే శ్మశాన వాటిక చెరువు నుంచి చాలా దూరంలో ఉంది. రోడ్డు వేయాలన్నా 15 మందికి పైగా జీరాయితీ రైతుల నుంచి భూమిని సేకరించాల్సి ఉంది. ఇలా పొంతన లేని సమాధానం చెప్పడంతో నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం ఎన్‌ఆర్‌జీఎస్ ఏపీవో ఎం.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో కొబ్బరి మొక్కలు తిరిగి నాటించారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి లుకలాపు అప్పలనాయుడు, పంచాయతీ కార్యదర్శి ఆర్.శ్రీధర్, ఎన్‌ఆర్‌జీఎస్ ఏపీవో ఎం.శ్రీనివాసనాయుడు, జేఈ గౌరి కృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, పీల్డ్ అసిస్టెంట్ ఏ.సూర్యనారాయణ పాల్గొన్నారు.
చెరువు గట్టు తవ్వకం అక్రమమే
Comments
Please login to add a commentAdd a comment