విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
ఆమదాలవలస: సంక్షేమం, అభివృద్ధి అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. సూపర్‌సిక్స్ హామీలు నెరవేర్చకుండా నయవంచన పాలన చేస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.3600 కోట్లు బకాయిలు ఉంటే ఇటీవల బడ్జెట్లో రూ. 2,600 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు నేరుగా వారి ఖాతాలోకి సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు.
●రాష్ట్ర కాళింగ సామాజిక వర్గం అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు (రామారావు)మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై యువత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వారి పాలనకు నిదర్శనమన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగే యువతకు పోరుకు ప్రతిఒక్కరూ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆమదాలవలస మండల పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామమూర్తి, పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్, సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment