లక్ష్మీ గణేష్ చిట్స్ యజమానుల ఆస్తుల జప్తు
నరసన్నపేట: నరసన్నపేటలో లక్ష్మీ గణేష్ చిట్స్ సంస్థకు చెందిన యజమానుల ఆస్తులను జప్తు చేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబరు 46 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో చిట్ ఫండ్ వ్యాపారి కోరాడ గణేశ్వరరావు, ఆయన భార్య కోరాడ లక్ష్మి, బంధువులు అంధవరపు సూర్యనారాయణమూర్తి, అంధవరపు భారతిల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక కలివరపుపేటలో నివసిస్తున్న గణేశ్వరరావు 2021 జూన్ 30న కుటుంబంతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయగా.. అనంతరం కేసు సీఐడీకి అప్పగించారు. సీఐడీ అదనపు ఎస్‌పీ రవివర్మ నరసన్నపేటకు పలుమార్లు వచ్చి వివరాలు సేకరించారు. అప్పటి వరకూ తప్పించుకు తిరుగుతున్న గణేష్, భార్య, బంధువులను అరెస్టు చేశారు.తాజాగా ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితులు రూ.2.5 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలను నడిపి 48 మంది బాధితల నుంచి రూ.3.26 కోట్లు, మరో 26 మంది బాధితుల నుంచి రూ. 2.59 కోట్లు డిపాజిట్లు రూపంలో సేకరించినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment