5న ఎంఎస్‌ఎంఈ రుణమేళా
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఈ నెల 5వ తేదీన ఎంఎస్‌ఎంఈ రుణాలకు సంబంధించి రుణమేళాను నిర్వహించనున్నట్టు యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ ఎం.వెంకట్ తిలక్ తెలిపారు. శ్రీకాకుళంలోని వెంకటాపురంలో ఉన్న యూనియన్ బ్యాంకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం రీజియన్ పరిధిలో యూనియన్ బ్యాంక్‌కు సంబంధించి 59 బ్రాంచ్‌లు ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో 43 బ్రాంచ్‌లు, పార్వతీపురం జిల్లాలో 16 బ్రాంచ్‌లు ఉన్నాయని వివరించారు. వీటి పరిధిలో రూ.8వేల కోట్ల మేర బిజినెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తమ బ్యాంకుల ద్వారా ఎంఎస్‌ఎంఈల రూపంలో గృహ, రిటైల్, విద్య, గోల్డ్, వ్యవసాయ తదితర రుణాలన్నీ అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశంలోని అన్ని బ్రాంచ్‌ల్లో ఎంఎస్‌ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈనెల 5న శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహిస్తున్నామన్నారు. దీన్ని జిల్లా ప్రజలు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేళాకు ముంబైలోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి జీఎం పి.శ్రీనివాస్ హాజరవుతారన్నారు. రుణమేళాకు వచ్చి రుణాలు అవసరమైన వారికి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment