అంతన్నారు.. ఇంతన్నారు..!
● సీఎం తొలి సంతకంపై డోలాయమానం
● ప్రకటనలకే పరిమితమవుతున్న డీఎస్సీ
● ఎదురుచూస్తున్న అభ్యర్థులు
పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ చేయడం, 117 జీవో రద్దు చేయడం వలన దాదాపు 32 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్నట్లు తేలింది. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే 463 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 280కి పైగా స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు, 175 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అయితే జిల్లాలో 473 మంది స్కూల్ అసిస్టెంట్లు, 1000 మందికి పైగా ఎస్జీటీలు మిగులుగా ఉండగా, పండింట్ పోస్టులు అప్‌గ్రేడేషన్ తర్వాత 450 మంది వరకు పండింట్‌లు డీఈవో పూల్‌లో ఉన్నారు. వీరంతా మిగులుగా ఉన్నప్పుడు డీఎస్సీ పోస్టులు ఎలా భర్తీ చేస్తారనేది సందేహాస్పదం.
శ్రీకాకుళం: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం పెట్టిన డీఎస్సీపై డోలాయమానం కొనసాగుతోంది. అదిగో డీఎస్సీ అంటూ ఎప్పటికప్పుడూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా, స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 16,700 పోస్టులు భర్తీ చేస్తామని ఎప్పుడో ప్రకటించినా, ఇంకా విధివిధానాలు ఖరారవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గందరగోళం
117 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వలన పాఠశాల విద్యలో గందరగోళం నెలకొంది. హైస్కూల్‌లో 3, 4 తరగతులు తీసివేయడం వలన స్కూల్ అసిస్టెంట్లు సర్‌ప్లస్‌గా ఉండిపోయారు. ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థనే ఎత్తివేయాలి యోచిస్తూ ఉండడం వలన 1,360 మంది ఎస్జీటీలు సర్‌ప్లస్ కానున్నారు. కొందరు అధికారులు మాత్రం సర్‌ప్లస్‌గా ఉన్నవారిని మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో నియమిస్తామని, అందువలన డీఎస్సీలో పోస్టులు యధాతథంగా భర్తీలు జరుగుతాయని చెబుతుండటం విశేషం. ఇప్పటికే ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులుంటే తరగతికి ఒకరు చొప్పున 5 గురు ఎస్జీటీలను, 120 మందికి పైగా విద్యార్థులుంటే ఐదుగురు ఎస్జీటీలతో పాటు ఒక ప్రధానోపాధ్యాయున్ని నియమిస్తామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులుండేందుకు సంయుక్త పాఠశాలల విలీనం కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నంటినీ బేరీజు వేసుకంటే 100 మంది వరకు స్కూల్ అసిస్టెంట్లు, 500 వరకు ఎస్జీటీలను మోడల్ స్కూళ్లకు తరలించినా, ఇంకా 370 మంది స్కూల్ అసిస్టెంట్లు, 800లకు పైగా ఎస్జీటీలు మిగులుగానే ఉంటారు. ఈ లెక్కన డీఎస్సీ నిర్వహణ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రభుత్వం మాత్రం వచ్చే విద్యా సంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటిస్తోంది. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి తగ్గించడం వలన మిగులు ఉపాధ్యాయిలను అక్కడికి తరలించవచ్చని, అటువంటప్పుడు డీఎస్సీ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతోంది. నిష్పత్తి తగ్గించినా మిగులు ఉపాధ్యాయులతో ఆయా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది గానీ, డీఎస్సీ ఎలా నిర్వహిస్తారో ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర అధికారులకు తెలియాలి. ఏది ఏమైనా నిరుద్యోగులు మాత్రం డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment