మానవ సేవే.. మాధవ సేవ
● త్రిదండి చినజీయర్ స్వామీజీ
టెక్కలి: మానవ సేవే.. మాధవ సేవ అని త్రిదండి చినజీయర్ స్వామీజీ అన్నారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శ్రీరామ పాదుకా పట్టాభిషేకం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి సేవ దగ్గర ప్రతీ ఒక్కరూ ఒదిగి ఉండాలని సూచించారు. మనిషి ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి వికాస తరంగిణి అనేక ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగా మహిళల ఆరోగ్యానికి భద్రత కల్పించే దిశగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో వ్యాపించే క్యాన్సర్‌ను నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు 7 లక్షల మంది మహిళలకు వైద్యం చేయించామన్నారు. అనంతరం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం విశిష్టత గూర్చి ప్రసంగించారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ప్రతినిధి వర్మ, లమ్మత మధు, జి.చంద్రశేఖర్, జి.రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment