ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించండి
ఎచ్చెర్ల క్యాంపస్: బీఆర్‌ఏయూలో తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని లేబర్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు తీర్పు ప్రతిని ఫిర్యాదుదారులకు సోమవారం అప్పగించింది. వివరాల్లోకి వెళ్తే.. వర్సిటీలో 2024 జనవరి 1వ తేదీన 34 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అప్పటి వీసీ నిమ్మ వెంకటరావు నియమించారు. అయితే ఏడాది పూర్తయిన నేప థ్యంలో డిసెంబర్ 31వ తేదీన వీరిని తొలగించారు. వారంతా తమను అన్యాయంగా తొలగించారని లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో వర్సిటీ అధికారులు, తొలగించిన ఉద్యోగులు, ఏజీఎన్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో పలుమార్లు చర్చలు జరిపారు. దీనిపై జనవరి 8, 23, ఫిబ్రవరి 7, 15, 24, 25 తేదీల్లో కోర్టు విచారణ నిర్వహించి, అనంతరం సోమవారం ఉత్తర్వుల ప్రతిని ఫిర్యాదుదారులకు అందజేసింది.
కక్షతో తొలగింపు..?
బాధిత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమకు నోటీసులు ఇవ్వకుండా తొలగించారని, కనీసం మూడేళ్లు కొనసాగించాలని కోరారు. వర్సిటీ అధికారులు కేవలం కక్షతో తొలగించారని, అనంతరం అనేక మందిని ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా నియమించుకున్నారని ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధికారుల తరుపున కాంట్రాక్టు అధ్యాపకులు పద్మారావు, జూనియర్ అసిస్టెంట్ రాధిక హాజరయ్యారు. ప్రతిఏటా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెన్యూవల్ చేస్తారన్నారు. అయితే వారి సేవలు సంతృప్తిగా లేవని, నియామకాలు సక్రమంగా లేకపోవడంతో తొలగించామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాము రాజీకి ప్రయత్నించామని లేబర్ కోర్టు తెలిపింది. చర్చల్లో వర్సిటీ అధికారులు కొనసాగింపునకు ముందుకు రాలేదని, ఉన్నత న్యాయస్థానానికి అపీల్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో తొలగించిన ఉద్యోగులు హైకోర్టులో నడుస్తున్న కేసులో ఈ తీర్పు ప్రతిని చేర్చనున్నట్లు చెప్పారు. కాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన అధికారులు, గత కొన్ని నెలలగా తమకు నచ్చినవారిని ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా రాజకీయ సిఫార్సులు ఆధారంగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఒక ప్రజాప్రతినిధి ఇంటి వద్ద పనిచేస్తున్న ఇద్దరికి వర్సిటీ జీతాలు చెల్లిస్తుండడాన్ని పలువురు తప్పు పడుతున్నాయి.
లేబర్ కోర్టు సూచన
Comments
Please login to add a commentAdd a comment