నాలుక మడతేసిన టీడీపీ
అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా. దానిపై నాకు అవగాహన లేదు. నేను రాజకీయాలకు అతీతంగా పోటీ చేసి గెలిచాను. ఎవరి ఫొటోలు పెట్టుకుని గెలవలేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గెలిచా. నా గెలుపును రాజకీయాలతో ముడి పెట్టొద్దు. అవసరమైతే ప్రభుత్వంపై సామదానభేద దండోపాయాలకు సిద్ధంగా ఉన్నాను.
– గెలిచాక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు చేసిన వ్యాఖ్యలివి.
● ఎమ్మెల్సీ ఓటమి తర్వాత
మాట మార్చిన వైనం
● పాకలపాటి రఘువర్మతో పాటు గాదెకు ఓటేయాలని చెప్పినట్టు
బుకాయింపు
● రఘువర్మ కోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు
● పోలింగ్ రోజునైతే ఎక్కడికక్కడ
శిబిరాలు ఏర్పాటు చేసి ప్రచారం
● ఎన్ని చేసినా ఓటమి పాలైన టీడీపీ బలపరిచిన అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
టీడీపీ తనకు అలవాటైన ఆటను మరోసారి రక్తికట్టించింది. గెలిస్తే మనోడు.. ఓడిపోతే వేరే వాడు అన్నట్లు నిస్సిగ్గుగా వ్యవహరించింది. ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మను బలపరుస్తున్నామని టీడీపీ నాయకులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు అన్ని బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. తీరా రఘువర్మ ఓడిపోయాక గెలిచిన అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు ‘మావోడే’ అని ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ గాదె శ్రీనివాసులు నాయుడు ఎక్కడా సానుకూలంగా స్పందించలేదు సరికదా.. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విని.. అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా.. నాకు తెలియదే అంటూ తిప్పికొట్టారు. దీంతో టీడీపీ అప్రతిష్ట పాలైంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం ప్రారంభం కావడమే తరువాయి టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగి, తాము బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని, టీడీపీ మద్దతు ఉన్న రఘువర్మకు టీడీపీ సానుభూతి పరులంతా సహకరించాలని వాడవాడలా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన సమయంలో వారే తమ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇక, ఎన్నికల దగ్గర కొచ్చాక సీఎం చంద్రబాబునాయుడు పలు పర్యాయాలు టెలీ కాన్ఫరెన్స్‌లు పెట్టి పార్టీ మద్దతిచ్చిన రఘువర్మను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు బాధ్యత తీసుకోవాలని కూడా ఆదేశించారు. విశ్రమించకుండా పోలింగ్ వరకు పనిచేయాలని, ఆయన గెలుపును భుజాన వేసుకోవాలని సూచించారు. దానికి తగ్గట్టుగానే పోలింగ్‌కు మూడు రోజుల ముందునుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు మరింత స్పీడు పెంచారు. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమావేశాలు పెట్టి, రఘువర్మకు ఓటు వేసేలా చూడాలని శ్రేణులను కూడా సమాయత్త పరిచారు. పోలింగ్‌కు ముందు రోజైతే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూటమి పార్టీల అగ్రనేతల ఫొటోలను పెట్టుకుని, మరోవైపు మద్దతిచ్చిన రఘువర్మ నిలువెత్తు ఫొటోను డిస్ ప్లే చేసి ప్రత్యేక వీడియో విడుద ల చేశారు. టీడీపీ, జనసేన బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇక పోలింగ్ రోజునైతే ఏపీటీఎఫ్ కంటే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎక్కువగా పనిచేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గరలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చొని పాకలపాటి రఘువర్మకు ఓటు వేయాలని కోరారు. నరసన్నపేట నియోజకవర్గంలో బగ్గు రమణమూర్తి, ఎచ్చెర్ల నియోజకవర్గంలో నడికుదిటి ఈశ్వరరావు, ఆమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్, టెక్కలిలో పలువురు టీడీపీ నాయకులు, పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి, పొందూరులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేరుగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో గంటల తరబడి ఉండి, ఓటు వేసేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ బాటలోనే జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోనూ, పోలింగ్ రోజున కష్టపడి పనిచేశారు.
పోలింగ్ అనంతరం పాకలపాటి రఘువర్మ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌ల్లోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పోస్టులు కూడా పెట్టారు. ఏ సందర్భంలో కూడా రెండో ప్రాధాన్యత ఓటు గాదెకు వేయాలని ఒక్కసారీ విజ్ఞప్తి చేయలేదు. కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేదు. కానీ రఘువర్మ ఓడిపోగానే.. రెండో ప్రాధాన్యత ఓటు గాదె శ్రీనివాసులునాయుడుకు వేయాలని తామే చెప్పామని, ఇద్దరు మన అభ్యర్థులే అని చెప్పుకోవడం విడ్డూరంగా మారింది. టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడే కాదు ఓడిపోయిన పాకలపాటి రఘువర్మ కూడా బాధపడే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment