● రంగంలోకి ‘అధికారిక’ దళారులు ● వారాంతంలో కీలక అధికారి
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం
అరసవల్లి :
జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖలో.. వాటాల వ్యవహారం రచ్చరచ్చగా తయారైంది. వైద్య సేవలను పక్కనపెట్టి కేవలం పనులకు తగ్గట్టుగా ‘వసూళ్లు.. వాటాలే..’ ప్రధానమన్న రీతిలో కొందరు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ శాఖలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరుతుండటం గమనార్హం. డెమో విభాగం, పరిపాలన విభాగం నుంచి చేస్తున్న కలెక్షన్లు అన్నీ కీలకాధికారికి పెద్ద వాటాగా వారాంతంలో జేబులోకి చేరేలా ఈ అధికారిక దళారులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి పనికీ ఒక్కో రేటు..!
జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన అనేక అంశాలతో పాటు మార్కెట్‌లో ఎన్నో వ్యాపారాలకు ప్రత్యక్షంగా డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతులు పొడిగింపు, వివిధ రకాల వైద్య పరీక్షల ల్యాబ్‌ల ఏర్పాట్లు, స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్లు అనుమతులతో పాటు పౌల్ట్రీ ఫారం, గ్యాస్ గొడౌన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్‌వోసి), ప్రైవేటు పాఠశాలకు శానిటేషన్ సర్టిఫికేట్లు, ఇలాంటి అనుమతులను డీఎంహెచ్‌ఓ కార్యాలయమే అనుమతి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక విధుల్లో భాగంగా చేయాల్సిన సర్వీస్ రెగ్యులరైజేషన్లు, సర్వీస్ మేటర్లు, మెడికల్ లీవ్‌లు, మెటర్నటీ లీవ్స్, స్పెషల్ గ్రేడ్లు కేటాయింపు తదితర పరిపాలనాంశాలకు ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. వీటికి గాను గరిష్టంగా రూ.50 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పీహెచ్‌సీ వైద్యులకు అదే స్థాయిలో ఉండే ఓ మోనటరింగ్ విభాగ అధికారి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్షన్లకు సిద్ధమవ్వాలంటూ హుకుం జారీ చేశారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో స్పష్టమవుతోంది. ఇక కీలకమైన మాస్ మీడియా సెక్షన్ పరిధిలో ఉన్న జిల్లాలో ఉన్న సుమారు 310 వరకు స్కానింగ్ సెంటర్లు, 3 వేలకు పైగా ఉన్న ల్యాబ్‌ల రెన్యువల్స్‌తో పాటు కొత్త రిజిస్ట్రేషన్లు, అనుమతిచ్చేందుకు గాను రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూళ్లు మొదలుపెట్టేశారు. ఇందుకోసం కీలక అధికారి పేరిట మూడు వాటాలుగా కలెక్షన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదంతా డీఎంహెచ్‌వోకు తెలిసే జరుగుతుందనే ప్రచారం బయటకురావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ వాటాల వ్యవహారం చర్చనీయాంశమైంది. జిల్లాకు కొత్తగా వచ్చిన ఆయనకు స్థానిక జిల్లాకు చెందిన ఉద్యోగుల్లో ఎవరేంటో తెలియకపోవడంతోనే సమస్య వచ్చిపడిందంటూ ఉద్యోగుల్లోనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే నిన్నమొన్నటివరకు డీఎంహెచ్‌వోగా పనిచేసిన ఓ అధికారిణి ప్రాక్టీస్ చేసిన ఆసుపత్రి నుంచి కూడా ఇప్పుడు కలెక్షన్లు రావాల్సిందే అని దళారీ అధికార బృందం పట్టుపట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment