చెరువు దగ్గరకొస్తే | - | Sakshi
Sakshi News home page

చెరువు దగ్గరకొస్తే

Published Tue, Mar 11 2025 12:43 AM | Last Updated on Tue, Mar 11 2025 12:42 AM

చెరువు దగ్గరకొస్తే

చెరువు దగ్గరకొస్తే

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్‌ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్‌ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్‌ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కన్పించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్‌...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్‌. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్‌ ఇచ్చారు.

ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి

ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్‌ ఫజుల్లాత్‌ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్‌ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఽఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్‌ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు.

టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సంధ్యా గజపతికి బెదిరింపులు

బెదిరించింది తోటి టీడీపీ నాయకుడే

చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి బెదిరించారని మీడియాను ఆశ్రయించిన సంధ్యా గజపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement