హామీలు నెరవేర్చాలి
● కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల ఛలో విజయవాడపై రాష్ట్ర ప్రభుత్వ నిర్భందానికి నిరసనగా, 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సోమవారం అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ముందుగా వాంబే కాలనీ జంక్షన్ నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే మరలా ఇచ్చి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. శాంతియుతంగా ఛలో విజయవాడకు పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్భందాలు, అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఎన్నికల ముందు 42 రోజుల సమ్మె సమయంలో టీడీపీ నాయకులు మద్దతు తెలిపి, అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.సుజాత, కె.హేమలత, కె.లక్ష్మి, మాధవి, చంద్రమౌళి, పి.భూలక్ష్మి, టి.రాజేశ్వరి, అప్పమ్మ, లలిత, ఇ.అప్పలనర్సమ్మ, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment