కిడ్నీ ఆస్పత్రికి..
కాశీబుగ్గ: ఉద్దానంలో కిడ్నీ మహమ్మారిని కట్టడి చేయడంతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులతో అత్యుత్తమ వైద్యసేవలు అందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నిర్వహణను గాలికొదిలేసింది. సిబ్బంది కొరత, మందుల లేమి తదితర సమస్యలతో కిడ్నీ బాధితులు సతమతమవుతున్నారు.
ఇదీ పరిస్థితి..
గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.85 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్‌ను ప్రారింభించారు. ఉద్దాన కిడ్నీ బాధితులకు సేవలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం మారడంతో సేవలు మృగ్యమవుతున్నాయి. గత ఎనిమిది నెలల వ్యవధిలో సర్కారు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండటంతో ఇరవై ఐదు మందికిపైగా మరణించినట్లు సమాచారం. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు తప్ప మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి..తదితర కారణాలను పట్టించుకునే వారే కరువయ్యారు.
ఇవీ సమస్యలు..
● పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. కిడ్నీ వ్యాధి నిపుణులు ఒక్కరే కావడంతో అతని కోసం వేలాది మంది రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి.
●గత ప్రభుత్వంలోనే పూర్తిస్థాయి మెషీన్లు సిద్ధం చేసినా ప్రస్తుత ప్రభుత్వం ఆపరేటర్లను ఇంతవరకు నియమించలేదు. దీంతో బయటే పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది.
● ఆస్పత్రిలో అరకొరగా మందులు మాత్రమే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో 40 రకాల మాత్రలు మందులు అందించేవారు. ఇప్పుడు 23 రకాలు అందిస్తున్నా అందులో చాలావరకు స్టాకు లేదు. స్కానింగ్, ఇంజక్షన్లదీ అదే పరిస్థితి.
● ఇన్‌పేషెంట్‌కు డైట్ ఇవ్వడం లేదు. వారం నుంచి పది రోజులు ఉండాల్సిన వ్యాధిగ్రస్తులు, వారికి సహాయంగా వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
మందులు ఇవ్వడం లేదు..
కిడ్నీ సమస్యకు సంబంధించిన మాత్రలు ప్రభుత్వం ఇవ్వమని రెండు వారాలుగా అడుగుతున్నా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి పలాస కిడ్నీ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులోకి తీసుకురావాలి.
– పిట్ట నీలయ్య,
ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, కోసంగిపురం కూడలి
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆసుపత్రిలో డైట్ ఇవ్వకపోవడం వాస్తవమే. వైద్యులు, మిషన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉంది.
– డాక్టర్ అల్లు పద్మజ,
సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస
నిర్వహణను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
వసతుల లేమి..మందుల కొరత
Comments
Please login to add a commentAdd a comment