21 నుంచి జాతీయ ఆహ్వాన నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21 నుంచి 23 వరకు హనుమంతు చిన్నరాములు స్మారక జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సుమిత్రా కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను ఆదరించి, వాటిని భావితరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రపంచ రంగస్థళ కళాకారుల దినోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. 21న షిరిడిసాయి వెల్ఫేర్ అసోసియేషన్(అనకాపల్లి) ‘ఆశ కదరా శివ’, 22న చైతన్య కళాభారతి(కరీంనగర్) ‘స్వప్నం రాల్చిన అమృతం’, మణికంఠ ఆర్ట్స్(పిఠాపురం) ‘కొత్త తరం కొడుకులు’, ఉషోదయా కళానికేతన్(కట్రపాడు) ‘కిడ్నాప్’, 23న అరవింద్ ఆర్ట్స్ (తాడేపల్లి) ‘అసత్యం’ నాటిక ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. ప్రముఖ సినీ, టీవీ, హాస్యనటులు అప్పారావు ఆధ్వర్యంలో హాస్యవల్లరి ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. సమావేశంలో సమితి కార్యదర్శి గుత్తు చిన్నారావు, కోశాధికారి నక్క శంకరరావు, ఉపాధ్యక్షులు మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, మెట్ట పోలినాయుడు, కొమనాపల్లి సురేష్, కొంక్యాన మురళీధర్, పార్థసారధి, వరలక్ష్మీ, ఉషారాణి, యు.పూజ, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.