
● ఆదిత్యుని ఆదాయం 11.. వ్యయం 5
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ అనివెట్టి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో ఉగాది ఆస్థానాన్ని ఆలయ ఈఓ వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముందుగా పంచాంగ పూజ, ఆలయ కొత్త రికార్డు పుస్తకాలు, అకౌంట్స్ పుస్తకాల పూజా కార్యక్రమాలను చేయించారు. అనంతరం ఆదిత్యుని రాశిఫలాలుగా విశాఖ నక్షత్రం, తులా రాశి ఫలాలను శంకరశర్మ వివరించారు. ఈమేరకు ఆదాయం 11, వ్యయం 5 గాను ఉందని, గత ఏడాది కంటే మిన్నగా ఆలయంలో ప్రగతి కనిపించే అవకాశాలున్నాయని వివరించారు. అనంతరం రాష్ట్ర దేవదాయ శాఖ ఆదేశాల ప్రకారం ఆలయంలో విశిష్ట సేవలకు గాను ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్ రాజేశ్వర కాశ్యప శర్మ, వేదపండితులు ధర్బముళ్ల శ్రీనివాసశర్మ, రంప వికాష్ శర్మలకు ఉగాది పురస్కారాలను ఆలయ ఈఓ వై.భద్రా జీ అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయం పేరిట ముద్రించిన కొత్త పంచాంగం పుస్తకాలను భక్తులకు దాతలకు అందజేశారు. ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు.