
దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం
జలుమూరు: ఉగాది రోజున మండలంలోని యలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దాదాపు 300 ఏళ్ల పురాతన మల్లికార్జున స్వామి ఆలయం గోడలపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శిలువ గుర్తులు వేసి, ఆ మతానికి సంబంధించిన రాతలు రాశారు. ఆదివారం వేకువజామున అర్చకులు వసనాబి వెంకటరమణ ఆలయానికి వచ్చి గోడలపై రాతలు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఆలయంతో పాటు పక్క పంచాయతీలైన అక్కురాడ, కొండపోలవలసలోని ఆంజనేయ ఆలయాల్లో కూడా ఇలాంటి రాతలే రాశారు. దీంతో మూడు గ్రామస్తులతో పాటు విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్, బీజేపి నాయకులు, ఆనంద ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీనివాసనంద సరస్వతి తదితరులు యలమంచిలి శివాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అంతకుముందు అక్కురాడ, కొండపోలవలసలో రాతలను చెరిపేశారు. యలమంచిలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస డీఎస్పీలు డీఎస్‌ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, వివేకానంద, అప్పారావు పలువురు సీఐ, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాసిన వారిని రెండు రోజుల్లో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ రాతలు రాసిన వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పా టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. దీనికి ముందు ఆయన మూడు ఆలయాలను పరిశీలించారు. అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్‌ఐ బి.అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు.
యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస గ్రామాల్లో ఆలయాల గోడలపై రాతలు
ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు
యలమంచిలిలో ఉద్రిక్త పరిస్థితులు

దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం

దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం