మిగులు ధాన్యం కొనుగోలు చేయాలి
ఇచ్ఛాపురం రూరల్: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మిగులు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల శాసన మండలి బడ్జెట్ సమావేశంలో సైతం తాను ధాన్యం విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ నిలిచి పోయిందని, ఇప్పటి వరకు 49,2000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సేకరించిందని, మిగతా ధాన్యం ఎప్పుడు సేకరిస్తారంటూ ప్రశ్నించగా.. అధికార యంత్రాంగం స్పందించి 45000 మెట్రిక్ టన్నులు వరకు కొనుగోలు చేసిందన్నారు. ఇంకా సుమారు 60వేలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు స్పందించి రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని కోరారు.
ఉద్దానం విద్యార్థి ప్రతిభ
కాశీబుగ్గ: దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ (ఐఎంఓ ఢిల్లీ) ప్రతిభా పరీక్షలో మందస మండలం నాతుపురం బొడ్లూరుకు చెందిన బొడ్డు షణ్ముఖరావు సత్తాచాటాడు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వాహకుల చేతులమీదుగా ప్రశంసాపత్రం, మెడల్ అందుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు. షణ్ముఖరావు నాలుగో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. అనంతరం ఏపీఆర్‌ఎస్ ప్రవేశ పరీక్ష రాసి గుంటూరు జిల్లా తాడికొండ గురుకులంలో సీటు సాధించి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ప్రతిభ పట్ట ఉపాధ్యాయులు దాసరి ఈశ్వరరావు, తల్లిదండ్రులు బొడ్డు జీవనరావు, మోహిని, గ్రామస్తులు చేశారు.
ఘనంగా బీఎస్‌ఎన్‌ఎల్ మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో వీజీకె మూర్తి సభాప్రాంగణం వద్ద శుక్రవారం భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ 10వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ ఈయూ ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాగర్, కృష్ణబాలాజీలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు తక్షణమే 4జీ, 5జి ఎక్విప్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 2017 నుంచి పే రివిజన్, పెన్షన్ రివిజన్ అమలు చేయాలని కోరారు. అనంతరం ‘బీఎస్‌ఎన్‌ఎల్ మనుగడ–ఉద్యోగుల కర్తవ్యాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఈయూ జిల్లా అధ్యక్షునిగా మాతల గోవర్ధనరావు, కార్యదర్శిగా పోలాకి వెంకటరావు, కోశాధికారిగా జి.అరుణశ్రీతో పాటు 18 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్, బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ మర్రి నాయుడు, ఈయూ ప్రతినిధులు అభిమన్యు, ఆదినారాయణ, డి.శ్రీనివాసరావు, శివప్రసాద్, బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
మా ప్రమేయం లేకుండానే ఫిర్యాదు
టెక్కలి రూరల్: మండలంలోని పెద్దసాన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు మేరకు డీఈఓ తిరుమల చైతన్య విచారణ చేపటిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు తెలియకుండానే హెచ్‌ఎం ఫిర్యాదు చేశారని చెప్పారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయుడి మధ్య వివాదం ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో పాఠశాలకు సంబంధం లేని ఓ మహిళ పాత్ర ఉందన్నారు. ఉన్నతధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
శివాలయంలో చోరీ
రణస్థలం: పైడిభీమవరం శివాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీ, ఎలక్ట్రికల్ యాంప్లిఫయర్ పట్టుకుపోయారు. శుక్రవారం జె.ఆర్.పురం పోలీసులు ఆలయాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్సై ఎస్. చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిగులు ధాన్యం కొనుగోలు చేయాలి
మిగులు ధాన్యం కొనుగోలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment