వసూల్ రాజాలపై విజిలెన్స్
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో కొన్నాళ్లుగా సాగుతున్న అవినీతి అక్రమాలతో పాటుగా తాజాగా మొదలైన వసూల్ రాజాల అక్రమాలపై ‘విజిలెన్స్’ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంతర్గత వ్యవహారాలపై ఈ నెల 5న వైద్య శాఖలో వసూల్ రాజాల పేరిట ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. అందుకు అనుగుణంగా కార్యాలయంలో పరిస్థితులుండటంతో సంబంధిత అధికారులపై నిఘా ఉంచారు. ఇప్పటికే రెండుసార్లు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చేరిన విజిలెన్స్ బృందానికి పరిపాలన విభాగం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో నేరుగా డీఎంహెచ్‌వో డాక్టర్ బాలమురళీకృష్ణతోనే మాట్లాడి పరిస్థితులను అడి గి తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేయనున్నారు.
సాక్షిలో వరుస కథనాలు...
డీఎంహెచ్‌వో కార్యాలయంలో వరుసగా జరుగుతున్న పలు అక్రమాలపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం, అక్రమంగా రూ.లక్షల్లో వసూళ్లు చేయడంతో పాటు ఫేక్ జాయినింగ్ ఆర్డర్లు జారీ చేయడం వంటి అంశాలపై ఆధారాలతో సహా ప్రచురించిన సంగతి తెలిసిందే. వీటినే ప్రామాణికంగా తీసుకుని నిరుద్యోగ బాధితుల వివరాలతో పాటు అక్రమాలకు పాల్పడిన స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో కీలక సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరుపై చర్యలుండేలా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలావరకు అక్రమాలతో పాటు ప్రస్తుతం ఏళ్ల నాటి నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల విద్యార్హత సర్టిఫికెట్లు కూడా ఫేక్ అనే కథనాలు రావడంతో దీనిపైన కూడా విజిలెన్స్ దృష్టి పెట్టింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చేసినట్లుగా ఆర్డర్లు జారీ చేయడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో ఆన్‌లైన్‌లో జీతాలను జమ చేయడాన్ని విజిలెన్స్ అధికారులకు ఆశ్చర్యాన్ని కల్పించినట్లు సమాచారం. గత నెలలో విశాఖ డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు చేపట్టిన విచారణాంశాలను కూడా విజిలెన్స్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే అక్రమాలు, వసూల్ రాజాల బండారాలను విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపించేలా సన్నద్ధమవుతున్నారు. దీంతో రెండు రోజులుగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో స్తబ్దత నెలకొందరు. కొందరు లాంగ్‌లీవ్‌లో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
డీఎంహెచ్‌వో కార్యాలయంలో కీలకాధికారులపై నిఘా
సాక్షి కథనాలను ప్రామాణికంగా తీసుకుని విచారణ సాగిస్తున్న అధికారులు
వసూల్ రాజాలపై విజిలెన్స్
Comments
Please login to add a commentAdd a comment