
సైకిల్ ర్యాలీ.. తీరాన్ని రక్షించాలి
సోంపేట: తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పిస్తూ దేశంలోని తీర ప్రాంతం గుండా సీఐఎస్‌ఎఫ్ బృందం ఆధ్వర్యంలో మొట్టమొదటి సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఎం.అనిఫ్, డిప్యూటీ కమాండెంట్ వి.కె.ప్రభాకర్ తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ ఏర్పాటు చేసి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సైకిల్ ర్యాలీని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ బకేలి నుంచి ఒక బృందం, గుజరాత్ లఖపథ్ నుంచి ఒక బృందం సైకిల్ ర్యాలీ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బృందం 700 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం రాత్రి సోంపేటకు చేరుకుంది. ఈ రెండు బృందాలు మార్చి 31న కన్యాకుమారిలో కలిసి యాత్ర ముగించనున్నాయి. 9 రాష్ట్రాల్లో 25 రోజుల పాటు 100 మంది సభ్యులు 6553 కిలోమీటర్లు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. 250 తీర ప్రాంత వ్యాపారకేంద్రాలు, 75 వ్యాపార కేంద్రాలను కలుపుకుంటూ ర్యాలీ చేస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా నిషేధం, అక్రమ ఆయుధాల నివారణ, తీవ్రవాదుల చొరబాటు నియంత్రణ, తీరప్రాంత భద్రత, మహిళా సాధికారత, సముద్ర తీర ప్రాంత వృక్షజాలం, జంతుజాలం పరిరక్షణ కోసం సీఐఎస్‌ఎఫ్ కృషి చేస్తుందన్నారు. సోంపేటలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సోంపేట యువత ఘనస్వాగతం పలికారు. నటరాజ నాట్యకళామండలి సభ్యులు ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.