డోర్ డెలివరీ చేసేదెప్పుడో?
పొందూరు:
గత 20 రోజులుగా పొందూరు ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. డోర్ డెలివరీ జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక గొడౌన్‌కు వెళ్లి గ్యాస్ ద్విచక్రవాహనాలపైనే సిలిండర్లను తీసుకెళ్తున్నారు. మరికొందరు సైకిళ్లపై తీవ్ర ప్రయాసలకోర్చుతూ సిలిండర్లను పట్టుకెళ్తున్నారు. ఇంకొందరు మహిళలు ఏకంగా తలపైనే మోసుకెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఆటోలను ఆశ్రయిస్తే దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.200 వరకు అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రద్దవుతున్న బుకింగ్ ఆర్డర్స్...
ఆటోమేటిక్ రీఫిల్ బుకింగ్ సిస్టమ్‌లో ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ కావడం లేదు. పైగా మీరు బుక్ చేసుకున్న గ్యాస్ కాన్సిల్ అయ్యిందని మెసేజ్‌లు వస్తుండటంతో లబ్ధిదారులు అసహనానికి గురవుతున్నారు. ఎందుకు క్యాన్సిల్ అవుతుందో తెలియక సతమతమవుతున్నారు. పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలను వజ్రపుకొత్తూరు, రణస్థలం ఏజెన్సీలకు అప్పగించారు. రణస్థలం ఏజెన్సీ ఇప్పటికీ స్పందించలేదు. వజ్రపుకొత్తూరు ఏజెన్సీ మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తోంది. గ్యాస్ గొడౌన్ వద్దకు వచ్చిన కస్టమర్లకు మాత్రమే ఈ నెల 11 నుంచి సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. రణస్థలం ఏజెన్సీ వారు కూడా గ్యాస్ సరఫరా ప్రారంభిస్తే చాలావరకు సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది.
ఏరియా కోడ్ జోడించలేదా..?
గ్యాస్ బుక్ చేసుకొన్న డోర్ డెలివరీ చేయకపోవడం, గ్యాస్ బుకింగ్ కాన్సిల్ అయినట్లు మెసేజ్‌లు వస్తుండటంపై వజ్రపుకొత్తూరు ఏజెన్సీ సిబ్బందిని ప్రశ్నించగా ఏరియా కోడ్ కస్టమర్ ఖాతాలకు అనుసంధానం కాలేదని చెప్పారు. బుక్ చేసుకున్న వారిలో కొందరికి బిల్లు జనరేట్ కావడం లేదన్నారు. గొడౌన్‌కు వచ్చి గ్యాస్ తీసుకున్న వారికి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతున్నాయని తెలిపారు. గ్యాస్ బుక్ చేసి పది రోజులు దాటిన వారివి కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. లేదంటే కస్టమర్ ఖాతా బ్లాక్ అవుతుందని తెలిపారు. మరో రెండు రోజుల్లోగా ఏరియా కోడ్ సర్దుబాటు జరుగుతుందని, తమ వజ్రపుకొత్తూరు కోడ్‌లో కనిపిస్తాయని ఆ రోజు నుంచి డోర్ డెలివరీ జరుగుతుందని పేర్కొన్నారు.
పొందూరులో ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు తప్పని తిప్పలు
గ్యాస్ బుక్ చేస్తే క్యాన్సిల్ మెసేజ్‌లు వస్తున్నాయని లబ్ధిదారుల ఆవేదన
తప్పెవరిది..
శిక్ష ఎవరికి?
డోర్ డెలివరీ చేసేదెప్పుడో?
డోర్ డెలివరీ చేసేదెప్పుడో?