184 వినతుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 184 అర్జీలు స్వీకరించారు.
వినతుల్లో కొన్ని..
● ఇంజినీరింగ్ పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి జరగనున్నాయని, అయితే ఫీజు చెల్లించలే దని కళాశాల యాజమాన్యం హాల్ టిక్కెట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో పరీక్షలు రాయలేకపోతున్నామని, కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విద్యార్థి పి. శ్రీనివాసరావు కోరాడు.
● విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కె.సోమ సుందర రావు, జనరల్ సెక్రటరీ పీఎస్ ప్రసాదరావు, స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు కోరారు.
● ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారని గార మండలం శ్రీకూర్మం పంచాయతీకి చెందిన పలువురు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. బస్టాండ్ వద్ద 15 సెంట్ల స్థలం ఆక్రమించి బోరు వేసి గోడలు కడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పంచాయతీ హక్కులను కాలరాస్తున్నారు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ పంచాయతీ తీర్మానాలతో సంబంధం లేకుండా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు నేరుగా వెండర్ రిజిస్ట్రేషన్ చేయించి, జాతీయ ఉపాధి హామీ నిధులతో పనులు చేయిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. వెండర్ రిజిస్ట్రేషన్ విధానం కేవలం అధికార పార్టీకి అనుకూలంగా చేశారని ఆరో పించారు. ఉపాధి పనుల నిర్వహణకు ప్రత్యేకంగా చట్టం ఉందని గుర్తు చేశారు. పంచా యతీ రాజ్ చట్టం ప్రకారం ఒక సంవత్సరంలో ఒక గ్రామ పంచాయతీకి వెచ్చించే మొత్తం ఖర్చులో కనీసం 50 శాతం పనులు పంచాయ తీల ద్వారా చేపట్టాలని ఉత్తర్వులు ఉన్నాయని, దాన్ని ఈ పాలకులు ఆచరించడం లేదని విమర్శించారు. ఈ విధానాలపై విజయనగరం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలం, లక్ష్మీపురం, మునకలవలస, గుల్లపాడు గ్రామ పంచాయతీలు గత ఏడాది నవంబర్ నెల 26న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయని తెలిపారు. తుది తీర్పు ఈ ఏడాది ఫిబ్రవరి 5న వెలువడిందని, ఈ కోర్టు ఉత్తర్వులు ప్రకారం అభివృద్ధి పనులు మొత్తాన్ని గ్రామ పంచాయతీల ద్వారానే నిర్వహించాలని తెలిపిందని అన్నారు. ప్రస్తుతం పంచాయతీలు అన్నింటినీ వైఎస్సార్ సీపీ ప్రతినిధులు ఉన్నందున, ఆ అక్కసుతోనే కూటమి ప్రభుత్వం అలసత్వం చూపుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment