నేడు ఎస్‌బీఐ పెన్షనర్స్ సర్వసభ్య సమావేశం
శ్రీకాకుళం అర్బన్: ఎస్‌బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ నాలుగో సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కె.రామచంద్రరావు తెలిపారు. నగరంలోని సన్‌రైజ్ హోటల్‌లో ఎస్‌బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాను రెండు విభాగాలుగా ఎస్‌బీఐ ఇండియా, ఎస్‌బీఐ హైదరాబాద్, అమరావతి సర్కిల్స్‌గా విభజించారన్నారు. 2022లో గుంటూరులో ఎస్‌బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మూడుచోట్ల సర్వసభ్య సమావేశం నిర్వహించామని, నాలుగో సర్వసభ్య సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10,500 మందితో పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అతిపెద్ద సభ్యత్వం కలిగిన పెన్షనర్స్ యూనియన్‌గా దేశంలోనే నంబర్ వన్ అసోసియేషన్‌గా ఉందని వివరించారు. ఎస్‌బీఐ విశ్రాంత ఉద్యోగులకు అత్యధిక పెన్షన్ అందుతుందని అనుకోవడం అపోహ మాత్రమేనని వెల్లడించారు. ఏ ద్వైపాక్షికంలో రిటైర్ అయితే ఆవిధంగానే పెన్షన్ అందజేస్తున్నారని తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు తాము సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు. విశ్రాంత ఎస్‌బీఐ పెన్షనర్స్ తరఫున రెడ్‌క్రాస్ సంస్థకు ఫ్రిజ్‌ను అందజేయడం జరిగిందని, అదేవిధంగా ప్రశాంతి వృద్ధాశ్రమంలో ఎనిమిది మంచాలను అందించినట్లు వివరించారు. గత ఐదేళ్లలో పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు చేయడంలో శ్రీకాకుళం నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పీఎస్వీఎస్ శర్మ, డీజీఎస్‌సీహెచ్ వెంకటేశ్వరరావు, సర్కిల్ ఉపాధ్యక్షుడు బాపయ్య పంతులు, ఏజీఎస్ శశిభూషణ్ రాజు, చైర్మన్ కోటేశ్వరరావు, వీఎస్పీ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.