ఆర్టీసీ యాజమాన్యం తీరు సరికాదు
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో యాజమాన్యం ఎంప్లాయిస్ యూనియన్‌కే కొమ్ము కాయడం అన్యాయమని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంయూ జిల్లా సెక్రటరీ ఎంఎన్ రావు మాట్లాడుతూ యాజమాన్యం ఒక యూనియన్‌కే కొమ్ముకాస్తూ వారు ఎలా చెపితే అలా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక కండక్టర్ వేరే డిపోలో పనిచేస్తూ శ్రీకాకుళం –1 డిపోకి రిలీవింగ్ డ్యూటీకి వచ్చారని, వారి ఆర్డర్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి కాలపరిమితి ముగిసిందన్నారు. అయినప్పటికీ అతనిని శ్రీకాకుళం 1వ డిపోలోనే కొనసాగిస్తూ కండక్టర్, డ్రైవర్ డ్యూటీ చార్ట్ కౌన్సిలింగ్‌లో అతనికి ప్రాధాన్యమిస్తూ సీనియారిటీ జాబితాలో పెట్టారని పేర్కొన్నారు. అతనికి, ఎంప్లాయిస్ యూనియన్‌కు ఆర్టీసీ యాజమాన్యం, డిపో యాజమాన్యం అన్ని విధాలా సహాయపడుతూ తమ ఎన్‌ఎంయూను చులకనగా చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే పంథా కొనసాగితే సహించేది లేదన్నారు. నిరసన కార్యక్రమంలో ఎన్‌ఎంయూ నాయకులు కె.నరసింహులు, నవీన్, ఎంఎస్ రాజు, కె.టి.రావు, వి.డి.రావు, ఆర్‌ఎస్ చలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment