కాలువ భూమి సమర్పయామి
● సాగునీటి కాలువపై టీడీపీ నేత కన్ను
● ఆక్రమణకు గురైన ఐదు ఎకరాలు
● భూమి విలువ రూ.రెండు కోట్లు పైమాటే
● యంత్రాలతో చదును చేస్తున్న వైనం
● చోద్యం చూస్తున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ఇప్పటికే ఎచ్చెర్లలో రోజుకొకచోట ఆక్రమణకు పాల్పడుతున్నారు. అవన్నీ ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడా జాబితాలోకి లావేరు మండలం చేరింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు సాగునీటి కాలువలను కబ్జా చేసేస్తున్నారు. దానిలో భాగంగా తామాడ, బుడతవలస పంచాయతీల రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ కాలువను ఆక్రమించుకునేందుకు చదును చేస్తున్నారు. బుడతవలస రెవెన్యూ పరిధిలోని 113/1, 113/2, 113/3, 113/4, 113/5, 113/7 సర్వే నంబర్లులో ప్రభుత్వ భూమిని, తామాడ రెవెన్యూ పరిధిలో 105 సర్వే నెంబర్‌లో ఉన్న సాగునీటి కాలువను మొత్తం 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి బుడతవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పూనుకున్నాడు. నెలరోజులుగా చదునుచేసే పనులు ప్రారంభించేశాడు. ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు, డోసర్లు ద్వారా ముందుగా బుడతవలస రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని సాగుచేసేశాడు. అంతటితో ఈయన దాహం తీరలేదు. పక్క పంచాయతీ తామాడ రెవెన్యూ పరిధిలోని తిమ్మప్ప చెరువు నుంచి తాతమానుచెరువు, తూటిబంద, పాతరౌతుపేట చెరువులకు కలుపుతూ ఉన్న కాలువను ఆక్రమించుకునేందుకు చదును చేసే పనులు చేపట్టాడు. ఇక్కడ జరుగుతున్న ఆక్రమణలను ప్రశ్నిస్తుంటే.. తన అనుచరులతో కేసులు పెట్టిస్తామని తిరిగి బెదిరిస్తున్నాడు. దీంతో స్థానికులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తామాడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రౌతు నారాయణరావు ఈ విషయమై జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని విన్నవించారు.
లావేరు మండలం తామాడ రెవెన్యూ పరి ధిలోని 105 సర్వే నంబర్లలో తాజాగా సాగు చేసి న భూమి ఇది. ఇక్కడ సాగునీటి కాలువ ఉండేది. ఇప్పుడా కాలువను కప్పేసి సమతలంగా చదును చేసేసి కబ్జాకు పాల్పడుతున్నారు. వాస్తవంగా బుడతవలస, తామాడ రెండు పక్కపక్క గ్రామాలు. ఈ రెండు గ్రామాల పరిధిలోని భూములు కలిసే ఉంటాయి. ఈ రెండింటిమధ్య ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలు ఉన్నాయి. వాటిపై టీడీపీ నాయకుడు కన్నుపడింది. పట్టపగలు జేసీబీలు, ట్రాక్టరు డోసెర్లు పెట్టి చదును చేసేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా ఏ అధికారీ ఆపే ప్రయత్నం చేయలేదు.
చర్యలు తీసుకోవాలి
లావేరు మండలం బుడతవలస, తామాడ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములను, సాగునీటి కాలువను సాయి అనే వ్యక్తి ఆక్రమించుకుని చదును చేస్తున్నారు. ఇక్కడ సాగునీటి కాలువ కూడా ఉంది. దీన్ని సైతం కబ్జా చేసి చదును చేస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి.
– రౌతు నారాయణరావు, తామాడ, లావేరు మండలం
నోటీసులు ఇచ్చాం..
తామాడ, బుడతవలస రెవెన్యూ పరిధిలో ఆక్రమణలు చేపడుతున్నవారికి నోటీసులు ఇచ్చాం. ఆక్రమణలను నిలిపివేయాలని ఆదేశించాం. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తప్పవు. – జోగారావు, లావేరు తహశీల్దార్
కాలువ భూమి సమర్పయామి
కాలువ భూమి సమర్పయామి
Comments
Please login to add a commentAdd a comment