ఇసుక అక్రమ తరలింపుపై ఆగ్రహం
నరసన్నపేట: గోపాలపెంట ఇసుక ర్యాంపు నుంచి రాత్రి సమయాల్లో ఇసుక తరలింపు జరుగుతోందని పోతయ్యవలస గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి ఇసుకతో వెళ్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, లారీ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి లారీలను ముందుకు పంపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో ఇసుక లారీలు అధికంగా వస్తున్నాయని, దీంతో ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తరలింపు నిలుపు చేయాలని కోరుతున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
యాప్ అమలు తప్పనిసరి
ఆమదాలవలస: అంగన్‌వాడీ వర్కర్లు తమకు ఇచ్చిన ఫోన్‌లో గల పోషణ ట్రాకర్ అనే యాప్‌లో ప్రతి ఒక్క లబ్ధిదారుని ఫేస్ క్యాప్చర్ చేయాలని జిల్లా ఉమెన్ అండ్ చైర్డ్ డెవలప్‌మెంట్, సాధికారత అధికారి బి. శాంతిశ్రీ సూచించారు. ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ ఎస్.అనురాధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ భీ పడాయి భీ 3 రోజుల శిక్షణలో మొదటిరోజు గురువారం ఆమె పరిశీలించారు. కార్యకర్తలకు సదుపాయాలు ఉన్నాయా లేదా అన్న అంశాలు తొలుత అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని కార్యక్తలకు సూచించారు. శిక్షణలో అందించే అంశాలు క్షుణ్ణంగా నేర్చుకొని అంగన్‌వాడీ కేంద్రాల్లో వాటిని విధిగా నిర్వహించాలన్నారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ‘కూటమి’ చేసిన మేలేంటి?
కవిటి: జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూటమి ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో చెప్పాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. ఆయన గురువారం శాసనమండలి సమావేశాల సందర్భంగా మీడియాపాయింట్ వద్ద ఈ అంశంపై మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రూ.700 కోట్లు ఖర్చుపెట్టి హిరమండలం నుంచి ఉద్దానం ప్రాంతానికి తాగునీరు తీసుకువచ్చారని గుర్తు చేశారు. రూ.79 కోట్లు వెచ్చించి 200 పడకలతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం కిడ్నీ రోగులను ప్రస్తుతానికి గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఒక డెత్ జరిగితే గానీ మరో బాధితుడికి డయాలసిస్ కేంద్రాల్లో బెడ్ ఇచ్చే దుస్థితి దాపురించిందన్నారు. ఇచ్ఛాపురంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ఈ సెంటర్‌ను తక్ష ణం ప్రారంభించాలన్నారు. సోంపేట, కవిటి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సెంటర్‌లలో డయాలసిస్ బెడ్స్ యూనిట్లు పెంచాలని డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ద్వారా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు మరింత వైద్య సదుపాయాలు సమకూర్చాలని కోరారు. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రూ.10వేల పింఛన్ ఇచ్చారని, దానికి మరో రూ.5వేలు కలిపి కూటమి ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.
ఇసుక అక్రమ తరలింపుపై ఆగ్రహం