ఉల్లాసంగా రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు
టెక్కలి: జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉల్లాసంగా జిల్లా జట్లు ఎంపికలు నిర్వహించారు. కర్నూల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించి జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.నారాయణరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఎంపికల్లో ఒక్కో జట్టుకు 12 మంది చొప్పున ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు డి.రామకృష్ణ క్రీడాకారులకు అవసరమైన దుస్తులు, రవాణా చార్జీల ను అందజేశారు. ఈ ఎంపికల్లో ఎన్.జనార్ధన్, కేకే రామిరెడ్డి, రాజా, కె.రఘనాథరావు, సత్యనారాయణ, శ్యామలరావు, మోతీలాల్, నారి, సీతయ్య, నర్మద తదితరులు పాల్గొన్నారు.
‘ఉల్లాస్’ అపహాస్యం
సారవకోట: వయోజనులకు విద్య నేర్పించి వారికి స్వయం శక్తి సంఘాలలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన పెంచేందుకు ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ఒక వలంటీర్‌ను నియమించి వారి ద్వారా గ్రామాలలో వయోజనులకు విద్య నేర్పించాలి. ఇదంతా స్థానిక సీఎఫ్ ఆద్వర్యంలో జరిగాలి. ఆదివారం ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా పరీక్ష నిర్వహించారు. అయితే మండలంలో ఈ పరీక్ష నిర్వహణ అపహాస్యమైంది. లక్ష్మీపురం, బుడితి, చీడిపూడి గ్రామాల్లో పరీక్షలు చేపట్టినట్లు చూపించారే తప్ప పరీక్షలు జరిగిన దాఖలాలు కనిపించలేదు. అవలింగిలో స్థానిక సీఎఫ్ కోట సంతోషి ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిన్నారులతో పరీక్ష పత్రాలను నింపించేశారు. లక్ష్మీపురంలో పరీక్ష కోసం సీఎఫ్ సుశీలను విచారించగా గ్రామంలో ఫంక్షన్ జరుగుతోందని పరీక్ష ఉదయం నిర్వహించామని చెప్పారు.
ముగిసిన నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక బాపూజీ కళామందిర్‌లో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన హనుమంతు చిన్నరాములు స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ, టీవీ హాస్యనటులు అప్పారావు ప్రదర్శించిన ‘హాస్యవల్లరి’ అందరినీ నవ్వించింది. అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి వారి ఆధ్వర్యంలో ‘విడాకులు కావాలి’ నాటిక ఆకట్టుకుంది. వల్లూరి శివప్రసాద్ రచించగా, గంగోత్రి సాయి దర్శకత్వంలో చక్కనైన ప్రదర్శన చేశారు. విశాఖకు చెందిన చైతన్య కళా స్రవంతి వారిచే ‘అసత్యం’ నాటిక కూడా అలరించింది. అనంతరం హా స్యనటుడు అప్పారావును సుమిత్రా కళాసమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, సుమిత్రా కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు, లోకనాథం రామలింగేశ్వరరావు, నక్క శంకరరావు, మండవిల్లి రవి, కిల్లా ఫల్గుణరావు, మూర్తి, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రదర్శనగా ‘స్వప్నం రాల్చిన అమృతం’
సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి నాటి క పోటీల్లో.. ఉత్తమ ప్రదర్శన బహుమతి కరీంనగర్, చైతన్య కళాభారతి ‘స్వప్నం రాల్చిన అమృతం’ నాటికకు దక్కింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, విశాఖ, చైతన్య కళాస్రవంతి వారి ‘అసత్యం’ నాటికకు, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన తాడేపల్లి, అరవింద్ ఆర్ట్స్ వారి ‘విడాకులు కావాలి’నాటికకు దక్కాయి. న్యాయనిర్ణేతలుగా మానాపురం సత్యనారాయణ, గెద్దా వరప్రసాద్, లండ రుద్రమూర్తిలు వ్యవహరించారు. విజేతలకు ప్రముఖ టీవీ, సినీ హాస్యనటులు అప్పారావు చేతుల మీదుగా బహుమతులను అందించారు.
ఉల్లాసంగా రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు