వామపక్ష పార్టీలు ఏకం కావాలి
నరసన్నపేట:
ప్రజల సమస్యలు పరిష్కారానికి, వారికి అండగా ఉండేందుకు వామపక్ష పార్టీల తలో మార్గంలో ఎర్రజెండా నీడన ఉద్యమాలు చేస్తున్నారని, బూర్జువా పార్టీలు కలిసి పనిచేస్తున్న తీరులో వామపక్ష పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని సినీ నటుడు, దర్శకుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నరసన్నపేట మండలం కోమర్తిలో మామిడి అప్పలసూరి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ అమరవీరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాలో ఉన్న ప్రధాన వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. 1960 నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న అప్పలసూరి ఆయన మరణించే వరకూ విప్లవ పార్టీలతో పాటు సీపీఐ, సీపీఎంలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని భావించే వారని, ఈ మేరకు చివరి వరకూ తన వంతు ప్రయత్నాలు చేశారని అధ్యక్షోపాన్యాసం చేసిన ప్రముఖ కథా రచయత అట్టాడ అప్పలనాయుడు గుర్తు చేశారు. ఎర్ర జెండాలన్నీ ఒక గొడుగు కిందకు రావడమే అప్పలసూరికి మనమిచ్చే ఘన నివాళి అవుతుందని నారాయణమూర్తి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అప్పలసూరి వ్యక్తిత్వం ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు దంతులూరి వర్మ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాశిరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, ప్రజా కళామండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, విజయనగరం పౌరహక్కుల సంఘం కార్యదర్శి సీహెచ్ పకీరునాయుడు, ప్రజా కళాకారుల సమాఖ్య ప్రతినిధి రౌతు వాసుదేవరావు, రచయిత గంటేటి గౌరినాయుడు, న్యాయవాది మామిడి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాకళామండలి ఆధ్వర్యంలో కార్యకర్తలు గీతాలు ఆలపించారు.
అప్పలసూరి ఆశయం నెరవేర్చాలి
జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభలో వక్తలు