
ఎస్సీ రైతుల భూముల్లో.. అక్రమంగా మట్టి తవ్వకాలు
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నరసన్నపేట మండలం బొడ్డవలసకు చెందిన ఎస్సీ రైతు కుటుంబాలు శ్రీరాంపురం వద్ద సాగు చేసి పంటలు పండించుకుంటున్న భూముల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి తహసీల్దార్ అనుమతి ఇచ్చారంటూ వందల కొద్దీ ట్రాక్టర్ల మట్టిని తవ్వేస్తున్నారు. పంట భూముల్లో మట్టిని తవ్వితే పంటలు ఎలా పండుతాయి.. తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ఎస్సీ రైతులు కూన అప్పలరామన్న, కూన రామారావు, కూన ఉపేంద్రలు వాపోతున్నారు. మండలంలోని రావులవలస పంచాయతీ శ్రీరాంపురం రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబర్ 25లో ఎల్‌పీ నంబరు 359లో తమకు మూడు ఎకరాల పొలం ఉందని, దీనిని 60 ఏళ్లుగా సాగు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దౌర్జన్యంగా తమ భూముల్లో మట్టిని తవ్వి పంటలు పండించుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారని వాపోయారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావులవలస, గుండవల్లిపేటలకు చెందిన కొందరు ఎమ్మెల్యే పేరు చెప్పి మట్టి తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని, కులం పేరుతో దూషించి దుర్భాషలాడుతున్నారని వాపోయారు. తహసీల్దార్ వద్దకు వెళ్లగా వెంటనే స్పందించి ఆర్‌ఐ, వీఆర్వోలను పంపారని, అయినా మట్టి తవ్వకాలు ఆపడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయమై కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయిస్తామని తెలిపారు.
రోడ్డు పనులకు అవసరమంటూ తవ్వకాలు
ట్రాక్టర్ లోడు రూ.500కు
అమ్ముకుంటున్న టీడీపీ నాయకులు
పోలీసులు పట్టించుకోవడం లేదని
బాధితుల ఆవేదన
అనుమతి ఇవ్వలేదు..
రైతుల భూముల్లో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. మాకు సమాచారం వచ్చిన వెంటనే ఆర్‌ఐ, వీఆర్వోలను పంపి మట్టి తవ్వకాలను ఆపించాం. మళ్లీ తవ్వుతున్నట్లు మాకు తెలియదు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణ, నరసన్నపేట తహసీల్దార్

ఎస్సీ రైతుల భూముల్లో.. అక్రమంగా మట్టి తవ్వకాలు