
సాంఘిక సంక్షేమ శాఖ డీడీపై దర్యాప్తు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని కేఆర్‌సీసీ కార్యాలయంలో ఎస్‌డీసీ బి.పద్మావతి విచారణ చేపట్టారు. తనకు సాంఘిక సంక్షేమ శాఖలోని వసతి గృహాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని డీడీ విశ్వమోహన్‌రెడ్డి రూ.2,50,000 లంచం అడగ్గా దఫదఫాలుగా రూ.2,30,000 ఇచ్చినట్టు కొత్తూరు మండలానికి చెందిన దళిత యువకుడు ఎస్.ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. అదనంగా రూ.20 వేలు ఇవ్వనందున డీడీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇటీవల ఇదే శాఖలో ఎనిమిది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను డీడీ చేపట్టారని, అందులో తన పేరు లేకపోవడంపై ప్రశ్నించగా తనతో పాటు గజేంద్ర, పవన్ అనే యువకులపైనా కులదూషణ చేసినట్లు తెలిపాడు. తమ డబ్బులు ఇచ్చేయాలని ప్రసాద్ తల్లి దమయంతి నిలదీయగా, ఆమెను కూడా దూషించినట్లు చెప్పాడు. కాగా, బాధితులు మాత్రం విచారణ సంతృప్తికరంగా లేదని, ఏకపక్షంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.