రైతు పోరాటాలతో రాష్ట్ర సర్కారుకు సంకటం, బెంగళూరులో రైతుల ర్యాలీ (ఫైల్)
సాక్షి, బెంగళూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. బెంగళూరులో భద్రతను పటిష్టం చేశారు. డీజీపీ ప్రవీణ్ సూద్, అన్నిచోట్ల ఐజీపీ, నగర పోలీసు కమిషనర్, అదనపు పోలీసు కమిషనర్, డీసీపీలకు తగిన బందోబస్త్ చేపట్టాలని ఆదేశించారు. నగరంలో తుమకూరు రోడ్డు, మాగడి రోడ్డు, మైసూరు రోడ్డు, హొసూరు రోడ్డు, దేవనహళ్లి రోడ్లలో మోహరించారు. ముందుగా మైసూరు బ్యాంకు సర్కిల్‌లో రైతుసంఘాల కార్యకర్తలు ధర్నా చేస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరతారు. ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు జరుగుతోంది. సిటీ, ఆర్టీసీ బస్సులు, రైళ్ల సంచారం యథావిధిగా ఉంటుంది. దుకాణాలు, మాల్స్ తదితర వాణిజ్య కేంద్రాలను మూసివేసే అవకాశముంది. (వ్యవసాయ బిల్లులపై నిరసనలు)
ఏమైనా జరగవచ్చు: కరవే
సోమవారం కర్ణాటక బంద్ ఎక్కడికైనా దారితీయవచ్చని కరవే అధ్యక్షుడు టీ.ఏ.నారాయణగౌడ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సోమవారం బంద్‌కు కరవే పూర్తి మద్దతునిస్తున్నదని, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరవే బంద్‌లో పాల్గొంటుందని తెలిపారు. సోమవారం బంద్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురుకు పట్టాలన్నారు. ఏపీఎంసీ, భూ సవరణ, గిట్టుబాటు ధరల చట్టాల ద్వారా రైతులకు మరణశాసనం రాస్తున్నారని దుయ్యబట్టారు.
బస్సులు యథాతథం
శివాజీనగర: రైతుల బంద్‌పై ప్రజలకు చింత వద్దు, ఈ బంద్‌కు ప్రభుత్వ మద్దతు లేదు, ఎప్పటిలాగే బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు సంచరిస్తాయని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. అన్ని రకాల దుకాణాలు తెరుచుకుంటాయన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధర్నా చేపట్టాలని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కన్నడ పోరాట నాయకుడు వాటాళ్ నాగరాజ్, ఎట్టి పరిస్థితిల్లోనూ బస్సులు రోడ్లపైకి రాకూడదని అన్నారు.
రైతు బంద్‌కు మద్దతు: డీకేశి
బనశంకరి: రైతుల పోరాటానికి పూర్తి మద్దతిస్తున్నట్లు కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు జాతీయస్థాయిలో తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ సీఎం యడియూరప్ప రైతు వ్యతిరేకి అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment