
ఇసుక అక్రమ రవాణాను నిలువరించి..
అర్వపల్లి: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు తక్కువ ధరకు ప్రజలకు ఇసుకను అందించడానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ జిల్లాలో ప్రవేశపెట్టిన సాండ్ ట్యాక్సీ విధానం ఫుల్ సక్సెస్ అయింది. గతంలో ఇసుక అక్రమ రవాణాతో గ్రామాల్లో ఘర్షణలు జరగడంతో పాటు ప్రభుత్వానికి పైసా ఆదాయం వచ్చేది కాదు. దీనికి తోడు గృహ నిర్మాణదారులు అధిక రేట్లకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలాగే సకాలంలో ఇసుక అందక ఇబ్బందులు పడేవారు. కానీ, కలెక్టర్ ప్రవేశపెట్టిన సాండ్ ట్యాక్సీ విధానంతో ప్రజలకు తక్కువ ధరకు ఇసుక దొరకడంతోపాటు ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి ఆదాయం లభిస్తోంది.
ఏడు మండలాలకు ఇసుక సరఫరా..
జాజిరెడ్డిగూడెం శివారులోని మూసీనది నుంచి సాండ్ ట్యాక్సీ విధానాన్ని 75రోజుల నుంచి అమలు చేస్తున్నారు. అయితే తుంగగూడెంలోని మూసీనది క్వారీ నుంచి సాండ్ ట్యాక్సీ విధానంలో ఇసుకను సరఫరా చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం, తుంగతుర్తి మండలాలకు సాండ్ ట్యాక్సీ విధానంలో ఇసుక సరఫరా చేసేవారు. ఇటీవల అదనంగా మద్దిరాల, అత్మకూర్(ఎస్), తిరుమలగిరి మండలాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఫ తుంగగూడెం రీచ్‌లో
సక్సెస్ ఫుల్‌గా సాండ్ ట్యాక్సీ
ఫ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అమలు
ఫ 75 రోజుల్లో జీపీకి
రూ.4.56 లక్షల ఆదాయం
ఫ ఇక్కడి నుంచే ఏడు మండలాలకు ఇసుక
పకడ్బందీగా అమలు చేస్తున్నాం
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాండ్ ట్యాక్సీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. తక్కువ ధరకు ఇసుక సరఫరా చేస్తున్నాం. ఇక్కడి నుంచి 7 మండలాలకు ఇసుక అందిస్తున్నాం. ఇళ్ల నిర్మాణదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– జక్కర్తి శ్రీనివాసులు, తహసీల్దార్
4,562 ట్రక్కుల ఇసుక తరలింపు
తుంగగూడెం నుంచి సాండ్ ట్యాక్సీ విధానం మొదలుగా ఇక్కడి నుంచి ఇప్పటి వరకు 4,562 ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను ఇతర మండలాలకు తరలించారు. అయితే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి రూ.4.56లక్షల ఆదాయం సమకూరింది. అలాగే ఈ పథకంతో ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు, కూలీలు ప్రతిరోజూ ఉపాధి పొందుతున్నారు. ఈ విధానం మొదలైనప్పుటి నుంచి అక్రమ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఒక్క గొడవ కూడా జరగడంలేదు. సాండ్ ట్యాక్సీ విధానంతో ఇళ్ల నిర్మాణదారులకు పెద్ద భారం తగ్గింది. తక్కువ ధరకు ఇసుక సరఫరా అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన జిల్లా కలెక్టర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఇసుక అక్రమ రవాణాను నిలువరించి..
Comments
Please login to add a commentAdd a comment