తిరుమలగిరి (తుంగతుర్తి): మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల అధికారులు, సిబ్బంది ని యామకం, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించడంతో పాటు ఈ నెల 15న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
700 మందికి ఒక పోలింగ్ కేంద్రం
జిల్లాలో పాత స్థానాలకే ఎన్నికలు నిర్వహించనున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు స్థానాలు పెరగలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామాలు విలీనమయ్యాయి. కానీ ఎంపీటీసీ స్థానాలు పెరగలేదు. ఈ సారి 23 మండలాల్లో 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి 700 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 11న పోలింగ్ కేంద్రాల జాబితాను మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. 11 నుంచి 13వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాలకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. 13న వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సూచనలు తీసుకోనున్నారు. 14న అభ్యంతరాలు స్వీకరించి కలెక్టర్ అనుమతికి పంపిస్తారు. కలెక్టర్ ఆమోదంతో 15న తుది జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు వస్తుండడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. వివిధ పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి గ్రామాల్లో అభ్యర్థులకు 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించడంతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించడంతో పురుషులకు రిజర్వేషన్లు రాకుంటే తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను నిలబెట్టడానికి అన్ని పార్టీల్లోని నాయకులు సిద్ధంగా ఉన్నారు.
ఫ రేపు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్న పోలింగ్ కేంద్రాల జాబితా
ఫ 15న విడుదల కానున్న తుది జాబితా
ఫ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు
సౌకర్యాల కల్పనపై
దృష్టి సారించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment