జోరుగా నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

జోరుగా నామినేషన్లు

Published Tue, Feb 11 2025 1:41 AM | Last Updated on Tue, Feb 11 2025 1:42 AM

జోరుగ

జోరుగా నామినేషన్లు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజున 18 మంది నామినేషన్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నుంచి రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు వేయగా.. ఇప్పటి వరకు 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మంగళవారం వాటి పరిశీలన జరగనుంది. వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈనెల 27న పోలింగ్‌ జరుగనుంది. మార్చి 3న కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.

భారీగా సమావేశాలు, ర్యాలీలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుంచి సోమవారం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇంతకుముందే నామినేషన్లు వేసిన వారు కూడా సోమవారం పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మరోసెట్‌ దాఖలు చేశారు. అందులో ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్‌రెడ్డి, పులి సరోత్తమ్‌రెడ్డి, పూల రవీందర్‌, ఎస్‌.సుందర్‌రాజు యాదవ్‌ తదితరులు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. పూల రవీందర్‌ బహుజన వాదంతో పెద్ద ఎత్తున ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయగా, పీఆర్‌టీయూ–టీఎస్‌ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి కూడా ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా, టీపీయూఎస్‌ మద్దతుతో పులి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ సమర్పించారు. సుందర్‌రాజు యాదవ్‌ వాహనాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు. అయితే సుందర్‌రాజుయాదవ్‌, పూల రవీందర్‌ నామినేషన్‌ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్‌ యూటీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్‌ జేఏసీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి గతంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు కూడా హర్షవర్ధన్‌రెడ్డి తరఫున ఆయన కూతురు హేమంత సంధ్యారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇలా మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు వేశారు.

13 వరకు ఉపసంహరణ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13వ తేదీన 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు.

జోరందుకోనున్న ప్రచారం

నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున ప్రచార ఘట్టం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని సంఘాలు క్షేత్ర స్థాయిలో ఓ దఫా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇకపై మరింత జోరుగా ప్రచారాన్ని కొనసాగించనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన సంఘాల అభ్యర్థులతో పాటు బహుజన వాదంతో ముందుకు వస్తున్న అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి, ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.

ఫ మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు

ఫ భారీ ర్యాలీలతో హోరెత్తిన నల్లగొండ

ఫ నేడు నామినేషన్ల పరిశీలన

అభ్యర్థుల వారీగా నామినేషన్లు

వేసిన సెట్ల సంఖ్య

అభ్యర్థి సెట్లు

అలుగుబెల్లి నర్సిరెడ్డి 3

పులి సరోత్తంరెడ్డి 3

పింగిళి శ్రీపాల్‌రెడ్డి 4

పూల రవీందర్‌ 3

గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 2

ఎస్‌.సుందర్‌రాజు 3

తాటికొండ వెంకటరాజయ్య 1

ఏలె చంద్రమోహన్‌ 3

దామర బాబురావు 3

లింగిడి వెంకటేశ్వర్లు 4

బంక రాజు 2

పన్నాల గోపాల్‌రెడ్డి 2

ఔర స్వాతి 1

చకిలం చంద్రశేఖర్‌ 2

తలకొప్పుల పురుషోత్తంరెడ్డి 3

కొలిపాక వెంకటస్వామి 3

కాటే సాయన్న 1

జంగిటి కై లాసం 1

జెట్టి శంకర్‌ 1

బోండా నాగరాజు 2

కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి 1

గండిరెడ్డి కోటిరెడ్డి 1

తండు ఉపేందర్‌ 1

No comments yet. Be the first to comment!
Add a comment
జోరుగా నామినేషన్లు1
1/1

జోరుగా నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement