ఏ పంట.. ఎన్ని ఎకరాలు
ప్రారంభమైన డిజిటల్ సర్వే
ఫ సాగు చేసిన పంటల వివరాలు
సర్వే నంబర్ల వారీగా సేకరణ
ఫ ఒక్కో ఏఈఓకు 2వేల
ఎకరాల చొప్పున సర్వే లక్ష్యం
ఫ ప్రత్యేక యాప్‌లో నమోదు
నాగారం : పంటల సాగు వివరాల్లో కచ్చితత్వం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ డిజిటల్ సర్వే చేపట్టింది. జిల్లాలో రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా వ్యవసాయ విస్తరణ అధికారులు పొలాల బాట పట్టారు. వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, ఇతర ప్రయోజనాల కోసం ఈ సర్వే దోహదపడనుంది.
నష్టం అంచనాకు ఉపయుక్తం..
రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూర్చేందుకు కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు అశాసీ్త్రయ లెక్కలతో నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. కేంద్రం నుంచి వచ్చే రాయితీ పథకాలు కూడా కోల్పోవాల్సివస్తుంది. పంటల బీమాతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టాన్ని అంచనా వేయడానికి ప్రస్తుత సర్వే దోహదపడనుంది. సాగు సామర్థ్యాన్ని పెంచడానికి, ఆధునికి సాంకేతికను పెంచేందుకు ఉపయుక్తంగా మారనుంది. గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పంటల సాగు వివరాలు తేలనున్నాయి.
ఒక్కో ఏఈఓకు 2 వేల ఎకరాలు
పంటల నమోదులో కచ్చితత్వం లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో 4.82లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలోని 83 క్లస్టర్ల పరిధిలో ప్రతి ఏఈఓకు 2 వేల ఎకరాల్లో డిజిటల్ సర్వే లక్ష్యం విధించారు. నామమాత్రంగా కాకుండా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి భూముల సర్వే నంబరు, ఉప నంబర్ల వారీగా పంటలను చిత్రీకరిస్తూ, యాప్‌లో నమోదు చేస్తున్నారు.
పంటల వివరాల నమోదు ఇలా..
గతంలో పంటల సాగు వివరాలను ఒకే చోట కూర్చొని కొందరు రైతుల నుంచి సేకరించేవారు. దీంతో సాగు లెక్కల్లో కొంత వ్యత్యాసం కనిపించేంది. కానీ కొన్నాళ్లుగా పంటల వివరాలు పారదర్శంగా నమోదు చేస్తున్నారు. ప్రతి రైతు వ్యవసాయ క్షేత్రానికి వ్యవసాయ విస్తరణ అధికారులు వెళ్తున్నారు. అక్కడ ఆ రైతు ఏఏ సర్వే నంబర్‌లలో ఏఏ పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేశాడు, రైతు పేరు, ఊరు, భూమి, బోరు బావులా, సాగునీటి సౌకర్యం ఉందా అనే వివరాలను నమోదు చేస్తున్నారు. పంటల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేసి ఫీల్డ్ నుంచే ఆన్‌లైన్‌లో ఫొటోలు తీసి రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా ఎంత విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారో తేలనుంది.
సకాలంలో పూర్తిచేస్తాం
జిల్లాలో పంటల డిజిటల్ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేతో రైతులకు బహుళ ప్రయోజనం కలగనుంది. ప్రతి రైతు సాగు చేసిన పంటలను వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో సందర్శించి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ఆదేశించాం. పంటల సర్వేను సకాలంలో పూర్తి చేసేలా చేసేలా సిబ్బందికి సూచించాం. – జి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట
ఏ పంట.. ఎన్ని ఎకరాలు
Comments
Please login to add a commentAdd a comment