
వంద శాతం వసూలే లక్ష్యం
తిరుమలగిరి: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులపై ఆధారపడకుండా ఆస్తి పన్ను రాబట్టడానికి అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తుండడంతో పన్ను వసూళ్లను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 51.50శాతం పన్ను మాత్రమే వసూలైంది. నిర్దేశించిన గడువులోగా వందశాతం లక్ష్యంగా ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలతో పాటు నివాస, నివాసేతర నిర్మాణాల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పెద్ద మొత్తంలో బకాయిలున్న వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. పన్నులు చెల్లించనట్లయితే ఆస్తులు జప్తు చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంటున్నారు.
ఉదయం 8 నుంచి
రాత్రి 8గంటల వరకు..
జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లు 51.50శాతం మాత్రమే అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇక 49 రోజులే సమయం ఉంది. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పోవడం, మరో వైపు సాధారణ పన్ను వసూలు సరిగా లేక కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు కనీసం అభివృద్ధి పనులు చేపట్టడానికి పన్నుల వసూళ్లే మార్గమని భావించిన అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డు అధికారులు, సిబ్బంది నివాస గృహాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి పన్ను వసూళ్ల కోసం 30బృందాలుగా ఏర్పాటై తిరుగుతున్నారు. ఒక్కో బృందంలో బిల్ కలెక్టర్, వార్డు ఆఫీసర్, సహాయకులు కూడా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుగుతూ బకాయిలు వసూలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఐదు మున్సిపాలిటీల్లో 51.50శాతం ఆస్తి పన్ను వసూలు
ఆర్థిక సంవత్సరం ముగింపునకు మిగిలింది 49 రోజులే
వసూళ్లకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
అభివృద్ధిలో భాగస్వాములు కండి
ఆస్తి పన్నులు ఉన్న వారు వెంటనే బకాయిలు చెల్లించాలి. వంద శాతం పన్నులు వసూలు చేసే దిశగా సిబ్బంది ఇంటింటికీ తిరిగుతున్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – యాదగిరి,
మున్సిపల్ కమిషనర్, తిరుమలగిరి
పన్నుల వివరాలు (రూ. కోట్లలో)
మున్సిపాలిటీ అసెస్‌మెంట్లు డిమాండ్ వసూలు చేయాల్సినవి
సూర్యాపేట 35,441 16.77 9.07 7.70
కోదాడ 16,883 7.78 3.62 4.16
హుజూర్‌నగర్ 8,396 2.46 1.21 1.25
తిరుమలగిరి 5,485 1.43 0.72 0.71
నేరేడుచర్ల 3,952 1.13 0.61 0.52
మొత్తం 70,157 29.57 15.23 14.33
Comments
Please login to add a commentAdd a comment