
అర్హత ఉన్నా అంతే..!
భానుపురి (సూర్యాపేట) : రైతాంగానికి రైతుభరోసా కష్టాలు ఇంకా వీడడం లేదు. ఇన్నాళ్లూ ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందోనన్న ఆందోళన ఉండగా.. ఇప్పుడిక తమకు ఈ డబ్బులు అందుతాయా..? లేదా అన్న సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. మొదట ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు రైతుభరోసా అందించింది. ఆ తర్వాత మరో రెండు విడతల్లో జిల్లాలో రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేసింది. కానీ ఇందులో కొందరు రైతులకు రెండెకరాలలోపు భూమి ఉండి అన్ని అర్హతలున్నా, గతంలో రైతుబంధు అందినా డబ్బులు రాలేదు. ఈ విషయమై అధికారులను సంప్రదించినా వారికే స్పష్టమైన సమాచారం లేకుండా పోయింది.
2,37,577 మందికి డబ్బులు జమ..!
జిల్లాలో మొత్తం 2,70,853 మంది పట్టాదారు పుస్తకాలు కలిగిన రైతులకు దాదాపు 6.19 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ మేరకు 2018 నుంచి రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా నిధులను దుర్వినియోగం చేయొద్దని భావించి కేవలం సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు మాత్రమే నిధులను అందించాలని నిర్ణయించి మొదటగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఆ తర్వాత ఎకరం లోపు, అనంతరం రెండెకరాలలోపు ఉన్నవారికి రైతు భరోసా అందించింది. ఈ మూడు విడతల్లో మొత్తం 2,37,577 మంది రైతుల ఖాతాల్లో రూ.162.24కోట్లు జమ చేసింది.
ప్రతి క్లస్టర్‌లోనూ రైతుల అయోమయం..
సాగుకు యోగ్యంగా లేని భూములను సర్వేచేసి అధికారులు గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇందులో జిల్లావ్యాప్తంగా 7,581.77 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా లేనట్లు గుర్తించారు. అయితే జిల్లాలోని ప్రతి క్లస్టర్‌లోనూ సాగుకు భూములు యోగ్యంగా ఉండి.. ప్రస్తుత సీజన్‌లో పంటలు వేసుకున్న కొందరు రైతులకు సైతం రెండెకరాల భూమి ఉండి కూడా డబ్బులు జమ కాలేదు. అలాగే మరికొందరికి ఉన్న భూమిలో సగం భూమికే నిధులు జమ అయ్యాయి. నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటి వరకు అందలేదు. దీంతో రైతులు తమ పరిధిలోని ఏఈఓలను ఫోన్ ద్వారా, రైతువేదికల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తున్న సంఘటన చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక కారణాలతో కాలేదా..? ఇతర ఏమైనా కారణాలు ఉండి ఉండొచ్చా..? అన్నదానిపై సంబంధిత అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. ఈ నిధులు జమకాని రైతులు ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది.. ? ఎలా నిధులను పొందాలన్న దానిపై ప్రభుత్వం కూడా ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించగా సాంకేతిక కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని, అలాంటి వారి విషయంలో దరఖాస్తులు తిరిగి స్వీకరించాలా..? లేదా నిధులు జమ అవుతాయా అన్నది తెలియదని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని పేర్కొంటున్నారు.
రెండెకరాలలోపు ఉన్నా అందని రైతు భరోసా
ఫ ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు రైతుల పాట్లు
ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
ఫ దీనిపై అధికారులకు లేని స్పష్టత
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు గునగంటి వెంకన్న. సొంతూరు ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రం. ఈయనకు 25గుంటల వ్యవసాయ భూమి ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఈ రైతుకు పెట్టుబడి సాయం అందింది. ఈ నెల 5వ తేదీన ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు డబ్బులు జమచేసినప్పటికీ ఈ రైతుకు మాత్రం అందలేదు. దీనిపై వ్యవసాయ అధికారులను సంప్రదించినా.. స్పష్టత లేకపోవడంతో పెట్టుబడి సాయం అందుతుందా లేదా అన్న ఆందోళనలో ఉన్నాడు. ఇదీ .. జిల్లాలో వందలాది మంది రైతుల పరిస్థితికి నిదర్శనం.
అందిన రైతు భరోసా వివరాలు ఇలా..
విడత రైతుల జమ అయిన డబ్బులు
సంఖ్య (రూ.కోట్లలో..)
ఎంపిక చేసిన 23 గ్రామాల్లో 29,352 26.73
ఎకరం లోపు భూములున్నవారికి 96,473 61.58
రెండెకరాల భూమి ఉన్నవారికి 1,11,752 73.93
డబ్బులు జమకాలేదు
మాకు ఎకరం 25 గుంటల భూమి ఉంది. ప్రతిసారి రైతుబంధు నిధులు వచ్చేవి. ఈ సారి ఇంతవరకు రాలేదు. మెసేజ్ కూడా రాలేదు. బ్యాంక్‌కు వెళ్లి చూసుకున్నా డబ్బులు జమ కాలేదు. వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే తెలియదని చెబుతున్నారు. ఏం చేయాలో అర్థంకావడంలేదు.
–కవిత, అడివెంల, జాజిరెడ్డిగూడెం మండలం

అర్హత ఉన్నా అంతే..!
Comments
Please login to add a commentAdd a comment