రామగిరి(నల్లగొండ): నిర్లక్ష్యంగా ఆటో నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌కు 8 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా మూడో అదనపు జడ్జి డి. దుర్గాప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు. ప్రొసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 నవంబర్ 14న మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన మామిడి యాదమ్మ, ఆమె భర్త లక్ష్మయ్య కలిసి తమ కుమార్తె పెళ్లికి బట్టలు కొనేందుకు అదే గ్రామానికి చెందిన మల్గిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆటో మాట్లాడుకుని మాల్‌కు బయల్దేరారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ వెంకట్‌రెడ్డి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఆటో కింద లక్ష్మయ్య పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యాదమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సత్యం, ఎస్‌ఐ నాగుల్‌మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ వెంకట్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రొసిక్యూటర్ జి. జవహార్‌లాల్ వాదనలతో ఏకీభవించిన జడ్జి డి. దుర్గాప్రసాద్ మద్యం సేవించి లక్ష్మయ్య మృతికి కారణమైన ఆటో డ్రైవర్ వెంకట్‌రెడ్డికి 8 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా లేదా మరో 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మర్రిగూడ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, లైజనింగ్ ఆఫీసర్ నరేందర్, మల్లికార్జున్ విచారణకు సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment