చేనేత సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
● సహకార్ భారతి ఆలిండియా చేనేత విభాగం అధ్యక్షుడు
అనంతకుమార్ మిశ్రా
భూదాన్‌పోచంపల్లి: చేనేత సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సహకార్ భారతి ఆలిండియా చేనేత విభాగం అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా పేర్కొన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లిలో రాష్ట్ర చేనేత సహకార్ భారతి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చేనేత పని ఒక్కరితో పూర్తికాదని, సమష్టి కృషితోనే అందమైన చీర తయారవుతుందని చెప్పారు. ఎంతో నైపుణ్యం కల్గిన చేనేత కార్మికులకు తగిన గుర్తింపు దక్కడం లేదని, సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. వీరి సురక్షిత జీవనానికి ప్రభుత్వాలు వెంటనే పూనుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సహకార్ భారతి కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంఘటిత ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహకార్ భారతి రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, బీజెపీ చేనేతసెల్ జిల్లా కన్వీనర్ గంజి బస్వలింగం, బీజెపీ అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, పట్టణ అధ్యక్షుడు డబ్బీకార్ సాహేశ్, చేనేతకార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్, మాజీ సర్పంచ్ నోముల గణేశ్, చేనేతనాయకులు ఏలే భిక్షపతి, రుద్ర శ్రీశైలం, రుద్ర చెన్నకేశవులు, కడవేరు శేఖర్, ఏలే శ్రీనివాస్, గొలనుకొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
రాజాపేట: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపురం గ్రామానికి బిట్ల రమేష్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రమేష్ కుటుంబ సభ్యులంతా కలిసి స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ హోటల్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ పెద్ద కుమారుడు బిట్ల పవన్(25) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాయికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చేనేత సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
Comments
Please login to add a commentAdd a comment