అప్పు తీర్చేందుకు వృద్ధురాలి హత్య●
● నిందితుడి అరెస్ట్
భువనగిరి: వృద్ధురాలిని హత్య చేసి పుస్తెలతాడు దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం డీసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు. ఆలేరు పట్టణంలోని రంగనాయక వీధిలో నివాసముంటున్న తునికి మణెమ్మ(80)కు జనగామ జిల్లాకు చెందిన పుల్లెంగుల శంకర్ బంధువు అవుతాడు. శంకర్ అప్పుడప్పుడు మణెమ్మ ఇంటికి వచ్చేవాడు. అప్పులపాలైన శంకర్ వాటిని తీర్చేందుకు ఒంటరిగా ఉంటున్న మణెమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడును దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం జనగామ నుంచి ఆలేరు పట్టణాకి వచ్చి మధ్యాహ్నం మణెమ్మ ఇంటికి వెళ్లి గొంతు నులిమి చంపేసి ఆమె మెడలోని పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడు. మృతురాలి కుమారుడు రామారావు ఫిర్యాదు మేరకు ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఆలేరు పట్టణంలో యాదగిరిగుట్ట సీఐ కొండల్‌రావు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కారులో అటుగా వస్తున్న శంకర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా.. మణెమ్మను తానే హత్య చేసి పుస్తెలతాడు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. రెండున్నర తులాల పుస్తెలతాడు, కారు, సెల్‌ఫోన్, రూ.5,720 నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. సీఐతో పాటు ఎస్‌ఐ రజనీకర్, సిబ్బంది సత్యనారాయణ, చంద్రశేఖర్, మహేష్ డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment