ఫైన్ విధిస్తున్నా.. మారట్లే!
సూర్యాపేట టౌన్, తిరుమలగిరి (తుంగతుర్తి) : జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు నెత్తురోడుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు చెబుతున్నా కొందరు వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకు పంపి జైలుశిక్ష పడేలా చేస్తున్నారు. ఒకటికన్నా ఎక్కువమార్లు పట్టుబడిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
పాయింట్ల ఆధారంగా శిక్ష
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి పాయింట్ల ఆధారంగా శిక్ష వేస్తారు. 2024 జనవరి నుంచి గత డిసెంబర్ వరకు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 12,940 నమోదు కాగా, రూ.66,97,500 జరిమానా విధించారు. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,350 కేసులు నమోదయ్యాయి. అందులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్రీతింగ్ అనలైజర్ యంత్రాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆల్కహాల్ శాతం 30 కంటే ఎక్కువ ఉంటే మద్యం తాగినట్లుగా నిర్ధారించి కేసులు నమోదు చేస్తున్నారు. 100 పాయింట్లు దాటితే వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసులో శిక్షపడిన తర్వాత దానిని తిరిగి అప్పగిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో యువతే ఎక్కువగా పోలీసులకు పట్టుబడుతున్నారు.
బీమా సైతం వర్తించదు..
మద్యం తాగి వాహనం నడపడం నేరమైనా కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారు ఇకపై వాహన బీమా ప్రయోజనాలు పొందలేరు. మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసులు నమోదై రుజువై అనర్హులుగా గుర్తింపు పొందుతారు. ఈ క్రమంలో ఇటీవల ప్రమాదాలు జరిగిన వెంటనే వాహనదారుల నుంచి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ఒకవేళ చనిపోతే జీర్ణాశయం నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు శాసీ్త్రయంగా రుజువైతే బీఎన్‌ఎస్ సెక్షన్ 185 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నారు.
అవగాహన కార్యక్రమాలు చేపట్టినా..
రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అవగాహన పోలీస్, రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు విస్త్రృతంగా నిర్వహించినా వాహనదారుల తీరు మారడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వచ్చే విద్యార్థులు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
మద్యం మత్తులో
డ్రైవింగ్ చేస్తున్న యువత
తరచూ రోడ్డు ప్రమాదాలు
పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం
మద్యం తాగి వాహనాలు నడపడం నేరం. తనిఖీల్లో పట్టుబడితే రెండు రోజుల నుంచి నెలవరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. తనిఖీల్లో పట్టుబడిన వారికి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నాం.
– సన్‌ప్రీత్ సింగ్, ఎస్పీ, సూర్యాపేట
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..
2023 22,875
2024 12,940
2025 1,350
తప్పిదాలు ఇవే..
హెల్మెట్ ధరించకపోవడం
ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లడం
మద్యం తాగి వాహనం నడపడం
మైనర్లు వాహనాలు నడపడం
ట్రాఫిక్ నిబంధనలను
పాటించకపోవడం
అతి వేగం
నంబర్ ప్లేట్ మార్చడం
సరియైన పత్రాలు లేకపోవడం
ఫైన్ విధిస్తున్నా.. మారట్లే!
Comments
Please login to add a commentAdd a comment