పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన
చివ్వెంల(సూర్యాపేట) : ఎస్సారెస్సీ కాలువ ద్వారా నీటిని వదిలి తమను ఆదుకోవాలని కోరుతూ పురుగుల మందు డబ్బా పట్టకుని ఓ రైతు పొలంలో నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. కుడకుడ గ్రామానికి చెందిన వేములకొండ లక్ష్మయ్య తన 12 ఎకరాల వ్యవసాయ భూమిలో రూ.2 లక్షల వ్యయంతో వరి సాగు చేశాడు. అదేవిధంగా ఎస్సారెస్పీ కాలువ దగ్గర నుంచి ఉన్న పిల్ల కాలువను సొంత ఖర్చులతో బాగు చేశాడు. అయితే 15 రోజులుగా కాలువ నీరు రాకపోవడంతో సగానికి పైగా పొలం ఎండిపోయింది. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో పురుగుల మందు డబ్బా పట్టుకుని పొలంలో నిరసన వ్యక్తం చేశాడు. గమనించిన ఇరుగుపొరుగు రైతులు లక్ష్మయ్యకు సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి ఎస్పారెస్పీ కింద వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment