
మళ్లీ.. భువన్ సర్వే
తిరుమలగిరి (తుంగతుర్తి): జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తుల వివరాలను కచ్చితంగా నమోదు చేసేందుకు భువన్ సర్వే మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. గతంలో చాలా వరకు ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి ఉపగ్రహ ఆధారంగా ఫొటోలు తీయడంతోపాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటించి ఆస్తుల వివరాలు నమోదు చేస్తారు. దాని ప్రకారం పన్నులు విధించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సర్వే అనంతరం ప్రతి ఆస్తికి సంబంధించి పది అంకెల ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయిస్తారు.
ఈసారి పక్కాగా..
ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి పక్కాగా కొలతలు సేకరించి అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం భువన్ యాప్‌ను తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా 2021–2023లో మొదటిసారిగా మున్సిపాలిటీల్లో ఆస్తుల వివరాల నమోదుకు భవన్ సర్వే చేపట్టారు. అనివార్య కారణాలతో అప్పట్లో ఈ సర్వేను నిలిపివేశారు. తాజాగా ఇళ్లు, వ్యాపార సంస్థలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఈ యాప్‌లో నిక్షిప్తం చేసేందు మళ్లీ సర్వేకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ సర్వే జరుగనుంది. గతంలో ముఖ్యంగా పట్టణాల్లో మాత్రమే ఈ సర్వే చేశారు. విలీన గ్రామాల్లో సర్వే పూర్తి కాలేదు. ఈసారి మొత్తం వార్డుల్లో సర్వే చేపట్టి ఆస్తుల వివరాలు నమోదు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనే ఇళ్ల ట్యాగింగ్ పేరుతో అప్పటి మున్సిపాలిటీలు, వాటి పరిధిలోని ఇళ్లకు సంబంధించిన చిత్రాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం దానిని అనుసంధానం చేసేలా యాప్ రూపొందించారు. తాజాగా మున్సిపాలిటీల్లో సమగ్ర సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేయనున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలకు అనుమతులు ఉన్నాయా ? లేదా అనే వివరాలు సేకరిస్తారు. ఆస్తి పన్ను ఎంత విస్తీర్ణానికి చెల్లిస్తున్నారు?, వాస్తవ విస్తీర్ణం ఎంతో కొలుస్తారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు.
మున్సిపాలిటీల్లో పక్కాగా ఆస్తుల
వివరాల నమోదుకు చర్యలు
క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని
ప్రభుత్వం ఆదేశం
నాలుగు నెలల్లో పూర్తికి ప్రణాళిక
త్వరలోనే ప్రారంభంకానున్న సర్వే
మున్సిపాలిటీ ఇళ్లు, భవనాలు
సూర్యాపేట 39,128
కోదాడ 23,572
హుజూర్‌నగర్ 10,761
తిరుమలగిరి 5,447
నేరేడుచర్ల 5,156
మొత్తం 84,064
Comments
Please login to add a commentAdd a comment