కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది
ఆత్మకూర్(ఎస్): కాంగ్రెస్ ప్రభుత్వం చేయని రుణమాఫీ చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేటలో మాజీ సర్పంచ్ పొన్నాల సంజీవరెడ్డి విగ్రహాన్ని ఆయనఆవిష్కరించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అబద్ధాలు చెబుతుందని విమర్శించారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై ప్రశ్నిస్తుంటే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. బ్యాంకులు చెప్పిన దానికి, కేబినెట్, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పేసరికి 30 శాతం రుణమాఫీ కూడా కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారని, మంత్రులు సంక్షేమం మరిచి జేబులు నింపుకుంటున్నారని, అసమర్ధ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆవేదన పడుతున్నారని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ విషయంలో కుట్రలు చేస్తోందని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, డీలిమిటేషన్ విషయంలో బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సాగనీయమని, తెలంగాణ హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, నాయకులు గోపగాని వెంకటనారాయణగౌడ్, నిమ్మల శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, ముద్దం కృష్ణారెడ్డి, బత్తుల ప్రసాద్, పన్నాల అలివేల, కసగాని బ్రహ్మం, జీడి భఇక్షం, ముద్దం మధుసూదన్‌రెడ్డి, గోపగాని మల్లయ్య తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి