
భర్తకు దూరంగా వున్న వివాహితను తిరిగి భర్త చెంతకు చేరుస్తానని నమ్మించి గర్భవతిని చేసిన డీఎంకే నేత
తిరువళ్లూరు: మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా వున్న వివాహితను తిరిగి భర్త చెంతకు చేరుస్తానని నమ్మించి గర్భవతిని చేసిన డీఎంకే నేతను తిరువళ్లూరు మహిళ పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ తిరుప్పాచ్చూర్ గ్రామానికి చెందిన హృదయరాజ్ కుమార్తె సత్య(20)కు గత ఏడాది పెళ్లి అయింది. ఆరు నెలలకే భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చేసింది.
అదే ప్రాంతానికి చెందిన డీఎంకే ప్రతినిధి కృష్ణన్(70)ను ఆమె ఆశ్రయించింది. తనను భర్త వద్దకు చేర్చాలని కోరింది. భర్త వద్దకు చేరుస్తానని నమ్మించి ఆమైపె పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో సత్య గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెబితే ఇబ్బందులు పడతావని కృష్ణన్ ఆమెను బెదిరించాడు. ఆమె రెండు రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. శిశువు మృతి చెందింది.
శిశువును ఇంటికి సమీపంలోనే పాతిపెట్టిన కృష్ణన్ విషయాన్ని బయటకు చెప్పవద్దని ఆమెను మళ్లీ బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సత్యను విచారించారు. కృష్ణన్ లైంగిక దాడి చేయడంతోపాటు విషయాన్ని బయటకు చెప్పవద్దని బెదిరించినట్టు నిర్ధారణ కావడంతో శుక్రవారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు.