అంబేడ్కర్ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని శుక్రవారం వాడవాడల్లో ఘనంగా నిర్వహించారు. రాజకీయ పక్షాల నేతలు అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, పుష్పాంజలితో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో సమత్తువ దినోత్సవంగా అధికారిక వేడుకలు జరిగాయి.
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వాడవాడల్లో ఉన్న ఆయన విగ్రహాల్ని ఆయా ప్రాంతాల్లోని సంఘాలు, రాజకీయ పక్షాల ప్రతినిధులు ముస్తాబు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాయకులు, సంఘాల ప్రతినిధులు తరలివచ్చి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అలాగే, ఆయా విగ్రహాల వద్ద ఉంచిన అంబేడ్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. డీఎంకే, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో సమత్తువ ( సమానత్వం) దినోత్సవం అంబేడ్కర్ జయంతి వేడుక నిర్వహించారు.
సీఎం నివాళి..
ఆర్‌ఏ పురంలోని అంబేడ్కర్ స్మారక మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి శేఖర్‌బాబు, ఎం సుబ్రణియన్ , కేఎన్ నెహ్రు ఏవి వేలు, సెంజి మస్తాన్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, వీసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత సెల్వ పెరుంతొగై, చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ నివాళులర్పించారు. అంబేడ్కర్ విగ్రహ వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి సీఎం స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. సేలంలో జరిగిన కార్యక్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. తేనీలో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం, చైన్నె కలెక్టరేట్ ఆవరణలో జరిగిన వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, టీ నగర్‌లోని నివాసంలో జయలలిత నెచ్చెలి శశికళ అంబేడ్కర్ చిత్రపటానికి అంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment