
స్వామిని దర్శించుకుంటున్న భక్తులు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ఆలయాల్లో శుక్రవారం భక్తి భావం మిన్నంటింది. తమిళ కొత్త సంవత్సరాదిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల్లో పరస్పరం శుభాకాంక్షలతో ఆనందాన్ని పంచుకున్నారు.
చిత్తిరై మాసం తొలిరోజును తమ కొత్త సంవత్సరంగా మొదటి నుంచి తమిళులు అనుసరిస్తున్నారు. గతంలో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో పొంగల్ పండుగను తమిళ కొత్త సంవత్సరంగా ప్రకటించారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే యథాప్రకారం చిత్తిరై మాసం తొలిరోజునే తమిళ ఉగాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి చిత్తిరై మాసం తొలిరోజును కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం తమిళ కొత్త సంవత్సరం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తి భావం మిన్నంటింది. ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.
బారులు తీరిన భక్తులు..
మదురై మీనాక్షి, తిరుచ్చి శ్రీరంగనాథ స్వామి, రామనాథపురం రంగనాథ స్వామి, పళణి దండాయుధ పాణి, తిరుచెందూరు సుబ్రమణ్యస్వామి, పిల్లయార్ పట్టి వినాయకుడి ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయంలో, చైన్నె వడపళని మురుగన్, కాంచీపురం మీనాక్షి ఆలయం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో వేకువజామున భక్తులు బారులు తీరారు. ఆలయంలో జరిగిన పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షించారు. తిరునల్వేలిలోని రాజగోపాల ఆలయంలో గోపూజ పెద్ద ఎత్తున జరిగింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లోని ఆదిపరాశక్తి పీటంలో చిత్తిరై తొలిరోజు ఉత్సవం కనులపండువగా జరిగింది. భక్తులకు కొత్త రూపాయి, రూ. ఐదు నాణెలను అందజేశారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఎడ్లబండి, రెక్లా పోటీలు జరిగాయి. చైన్నె టీనగర్‌లో టీటీడీ సమాచారం కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. తమిళ ఉగాది ఆస్తాన కార్యక్రమం జరిగింది. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, జీఎన్ చెట్టి రోడ్డులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా తమిళ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తమిళ ఉగాదికి వరుససెలవులు వచ్చాయి. శుక్ర, శని, ఆది వారాలు సెలవు దినాలు కావడంతో చైన్నె నుంచి పెద్ద ఎత్తున జనం స్వస్థలాలు, స్వగ్రామాలకు తరలి వె వెళ్లారు. గురువారం అర్ధరాత్రి వరకు చైన్నెలోని బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిశాయి.

శ్రీవారి సేవలో ఏజే శేఖర్