
పళణి వేల్ త్యాగరాజన్
ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలోని ఓ మీడియా ప్రతినిధితో ఆయన కొంత కాలం క్రితం మాట్లాడినట్లు భావిస్తున్న ఓ ఫోన్ కాల్ ఆడియో తాజాగా వివాదాస్పదమైంది. ఇందులో సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయ నిధి స్టాలిన్, బంధువులు కలిసి రూ. 30 వేల కోట్లు మింగేశారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. దీనిపై విచారణకు అన్నాడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి.
సాక్షి, చైన్నె: ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ఢిల్లీలోని ఓ మీడియా ప్రతినిధితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ వస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి మధ్య జరిగిన 26 ఫోన్‌కాల్స్‌కు సంబంధించిన సమాచారం. అందులో ఉన్న వారి మాటల్లోని అంశాలతో ఒక పూర్తిస్థాయి ఆడియో శనివారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ గొంతు ఆ ఆడియోలో ఉండటం చర్చకు దారి తీసింది.
రూ. 30 వేల కోట్లు కొట్టేశారు..
సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయ నిధి స్టాలిన్, బంధువులు శబరీషన్, మురుగన్ ఏడాది కాలంలో రూ.30 వేల కోట్లు కొట్టేశారని, ఇంత పెద్ద మొత్తాన్ని డీఎంకేలో ఉన్న మునుపటి నాయకులు కూడా సంపాదించ లేక పోయారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మొత్తాన్ని ఎలా దాచబోతున్నారో, ఎక్కడ పెట్టనున్నారో? అని ఉన్న తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు డీఎంకేలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ ఆడియోను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తీవ్రంగా పరిగణించారు. విచారణకు ఆదేశించాలని పట్టుబట్టారు. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అయితే, డీఎంకే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఇప్పటికే తాను డీఎంకే అక్రమాస్తుల జాబితా విడుదల చేశానని, తాజా ఆడియో ఆ పాలకుల అక్రమాలకు సాక్ష్యంగా మారిందని పేర్కొన్నారు. ఈ ఆడియోపై విచారణ జరగాలని, ఆర్థిక మంత్రి విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కలిసి విచారణకు ఆదేశించాలని కోరబోతున్నామన్నారు. అయితే ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ స్పందిస్తూ, ఆ గళం తనది కాదే కాదని, ఎవరో తన వలే మిమిక్రీ చేసినట్లుందని వ్యాఖ్యనించడం గమనార్హం. అదే సమయంలో అన్నామలై స్పందిస్తూ, ఈ ఆడియోలో ఉన్నది ఎవరి గళం అన్నది తేల్చుకునేందుకు ఫోరెన్సిక్ అనాలసిస్‌కు పరిశోధనకు సిద్ధమా..? అని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఆడియోలో ఉన్న గళం పళణి వేల్ త్యారాజన్‌దా..? కాదా? అన్నది పక్కన పెడితే, సీఎం ఫ్యామిలీని టార్గెట్ చేసి మరీ తీవ్ర ఆరోపణలు అందులో ఉండటం కొత్త చర్చకు తెర లేపినట్లైంది. ఈ వ్యవహారం మంత్రి మెడకు చుట్టుకున్న పక్షంలో పదవీ గండం తప్పదనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment