బన్నారి
సాక్షి, చైన్నె: ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో తనను వీఏఓ మొదలు తహసీల్దార్ వరకు చిన్నచూపు చూస్తున్నారని భవానీసాగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.బన్నారి ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే తాను ఏమ్మెల్యేగా కొనసాగుతున్నానని, కనీసం తనకు గౌరవం ఇచ్చే వాళ్లుకూడా లేదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈరోడ్ జిల్లా భవానీసాగర్ నియోజకవర్గం(ఎస్సీ) ఎమ్మెల్యే బన్నారి మీడియాతో ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం అన్నాడీఎంకే తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఆ వివరాల మేరకు.. తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు పూర్తి అయిందని, ఇంతవరకు తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పథకం కూడా జరగలేదన్నారు. తాను ఏదేని సిఫారసు చేసినా, ఆదేశాలు ఇచ్చినా వాటిని వీఏఓ మొదలు తహసీ ల్దార్ వరకు భేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు ఉద్వేగానికి లోనయ్యారు. ఇంటి పట్టాలు, పింఛన్లు, ప్రభుత్వ పథకా ల కోసం తన వద్ద కు వచ్చే వాళ్లకు న్యా యం చేసే విధంగా అధికారులకు సిఫారసులు, ఆదేశాలు చేస్తూనే ఉన్నానని, ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు.
పోలీసులు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు అయితే, తనను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రశ్నించినా, సమాధానం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే అనే మర్యాద కూడా ఇవ్వకుండా వెళ్లి పో తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎస్సీని కా వడంతో ఇక్కడున్న అధికారులు మరీ చిన్నచూపు చూస్తున్నారని, ఈ విషయాన్ని ఇంతవరకు తన పా ర్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేదన్నారు.
ప్రభుత్వ అధికారిక వేడుకలకు ఆహ్వానాలు అంతంత మాత్రమేనని, తనను ప్రజాప్రతినిధిగా కాకుండా, వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిగానే అందరూ చూస్తున్నారని ఉద్వేగ భరితంగా వ్యాఖ్యలు చేశారు. తనతో స్థానికంగా ఉన్న అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment